ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత సత్తా చాటేనా?
తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు తర్వాత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న కల్వకుంట్ల కవిత.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరును అభ్యర్థులుగా ప్రకటించారు. బీసీ వర్గానికి చెందిన విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 75 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
By: Garuda Media | 11 Nov 2026 11:00 PM ISTతెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తనయ.. కల్వకుంట్ల కవిత తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆమె తన పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరులను కవిత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి దించారు.
ఏ మాత్రం రాజకీయ నేపథ్యం లేని, చదువుకున్న విద్యార్థి నాయకులకు (కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థులు) టికెట్లు ఇచ్చామని కవిత చెబుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. ఈ పార్టీలు ప్రజలను వేధిస్తున్నాయని.. ప్రజలకు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే అది తామేనని ఆమె చెప్పడం గమనార్హం.
రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటు నమోదు తక్కువగా ఉందని, గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కవిత కోరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ప్రచార వాహనాలను ప్రారంభించిన కవిత, సింగరేణి ప్రాంతంతో పాటు నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ తదితర 75 నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాజకీయ సవాళ్లు
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కవిత ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. కొత్త పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ నిర్మించుకోవడం, ప్రధాన పార్టీల ఆర్థిక బలాన్ని తట్టుకోవడం ఆమె ముందున్న ప్రధాన సవాళ్లుగా పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు.. విద్యావంతులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో.. ఈ క్రమంలో కవితకు విద్యావంతుల్లో ఏమేరకు ప్రభావం ఉంది? వారు ఏమేరకు ఆమెను స్వాగతిస్తున్నారన్న విషయం కూడా స్పష్టం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
