ఎల్నినో ఎఫెక్ట్ : ఆల్ టైమ్ రికార్డ్ !
గత సెప్టెంబరు నెలలోనే 19.543 మెగావాట్ల నుండి 19,892 మెగావాట్ల డిమాండ్ నమోదయింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ బోరు మోటార్లు, పంపుసెట్లు పనిచేస్తున్నాయి.
By: Garuda Media | 16 Oct 2026 3:00 PM ISTఎల్నినో ప్రభావం అప్పుడే తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకో 10 నెలలు ఈ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ మొదలయింది. రాష్ట్రంలో ఆల్ టైమ్ హై పీక్ డిమాండ్ నిన్న ఉదయం 10.29 గంటలకు చేరుకుంది.20,003 మెగావాట్ల డిమాండ్ నమోదయింది.
ఈ అక్టోబరు 1 నుండి నిన్నవరకు రోజువారీ పీక్ 19,289 మెగా వాట్లుగా నమోదయింది. టీజీఎస్పీడీసీఎల్ దక్షిణ పరిధిలో అక్టోబరు 15న 12,281 మెగావాట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 4,220 మెగావాట్లు నమోదయింది. సాధారణంగా అక్టోబరు నెలలో 15 వేల మెగావాట్ల వరకు ఉండేది. ఎల్ నినో మూలంగా తక్కువ వర్షాలు, ఎక్కువ ఊష్ణోగ్రతల నేపథ్యంలో 5 వేల మెగావాట్ల డిమాండ్ అధికంగా నమోదు అవుతుంది.
గత సెప్టెంబరు నెలలోనే 19.543 మెగావాట్ల నుండి 19,892 మెగావాట్ల డిమాండ్ నమోదయింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ బోరు మోటార్లు, పంపుసెట్లు పనిచేస్తున్నాయి. రిజర్వాయర్ల నుండి సాగునీరు అందకపోవడంతో వ్యవసాయ మోటార్ల వినియోగం పెరిగింది. ఇక ఇండ్లు, కార్యాలయాలు. పారిశ్రామిక కేంద్రాలలో ఏసీలతో పాటు, ఎత్తిపోతల పథకాల పంపులు నడవడం మూలంగా అధిక డిమాండ్ నమోదు అవుతుంది.
ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు డిమాండ్ చేరుకున్న నేపథ్యంలో ఇంకా ఖరీఫ్ పంటలు కోతకు రావడానికి మరో 20, 25 రోజుల సమయం ఉన్నందున ఈ డిమాండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. యాసంగి సీజన్ తో పాటు, ఊష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే డిమాండ్ మరింత పెరుగుతుంది అని భావిస్తున్నారు.
హైడల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో దాదాపు 4 వేల మెగావాట్ల విద్యుత్ లోటు నమోదవుతుంది. దీంతో ఎక్కువగా థర్మల్ విద్యుత్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఒక యూనిట్ ధర గరిష్టంగా రూ.10కి చేరినప్పటికీ అవసరమైన మేరకు విద్యుత్ దొరకడం కష్టమవుతుంది. పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఏపీలలో కూడా కొరత ఉన్నందున మున్ముందు కరంటు కష్టాలు పెరిగే అవకాశమే కనిపిస్తుంది.
