Begin typing your search above and press return to search.

బీజేపీతో పొత్తా..? విజయశాంతికి టీడీపీ కౌంటర్

తెలంగాణ రాజధాని నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాజకీయ వేడి రాజుకుంది.

By:  A.N.Kumar   |   7 Oct 2025 11:00 PM IST
బీజేపీతో పొత్తా..? విజయశాంతికి టీడీపీ కౌంటర్
X

తెలంగాణ రాజధాని నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాజకీయ వేడి రాజుకుంది. దివంగత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటును దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే, ఈ ఉపఎన్నిక పోరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి చేసిన సంచలన ఆరోపణలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

విజయశాంతి సంచలన ఆరోపణలు: బీఆర్‌ఎస్–బీజేపీ–టీడీపీ ‘రహస్య మైత్రి’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలడంతో ఆ విజయాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ 'అనైతిక అవగాహన' కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రహస్య ఒప్పందంలో బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

విజయశాంతి ఆరోపణల సారాంశం:

ఈ ఉపఎన్నికలో బీజేపీ కేవలం డమ్మీ అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించి, తన రహస్య మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తోందట. బీజేపీతో మైత్రి ఉన్న టీడీపీ, ‘మిత్రధర్మం’ పేరుతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పైకి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ చెబుతున్నప్పటికీ, వాస్తవానికి టిడిపి కార్యకర్తలు బీఆర్‌ఎస్‌కు పని చేయాలనే ఆదేశాలు అందుకున్నారని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనే కుట్రతోనే బీఆర్‌ఎస్–బీజేపీ–టీడీపీలు ఈ రహస్య ఒప్పందం చేసుకున్నాయని విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె బీఆర్‌ఎస్, టీడీపీలను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

* “మీ భయం ఏంటమ్మా?” విజయశాంతికి టీడీపీ కౌంటర్

విజయశాంతి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది. హైదరాబాద్‌ టీడీపీ నేత జ్యోత్స్న తిరునగరి విజయశాంతికి గట్టి కౌంటర్ ఇచ్చారు. జ్యోత్స్న తిరునగరి ట్వీట్ చేస్తూ.. "మీ భయం ఏంటమ్మా విజయశాంతి? తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు! భయంతో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మా మీద పడతారా?" అంటూ ఆమె విజయశాంతిని సూటిగా ప్రశ్నించారు. "మా టీడీపీ అనేది ప్రజల కోసం, ప్రజలచేత ఏర్పడిన పార్టీ. మాకు విలువలు ఉన్నాయి, మేము వాటికి కట్టుబడి ఉంటాము. రాజకీయ లబ్ధి కోసం ఎవరితోనూ రహస్య ఒప్పందాలు చేసుకోం" అని ఆమె స్పష్టం చేశారు. ఉన్నప్పుడల్లా టీడీపీ మీద పడటం మానేయండి. చౌకబారు వ్యాఖ్యలతో మీకే మచ్చ తెచ్చుకుంటున్నారు" అంటూ జ్యోత్స్న తిరునగరి తీవ్రంగా బదులిచ్చారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం కాకముందే ఈ రాజకీయ పింగ్‌పాంగ్ చర్చ అత్యంత వేడెక్కడంతో, ఈ సీటు చుట్టూ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. విజయశాంతి ఆరోపణలు, టీడీపీ ప్రతిస్పందనతో ఈ ఉపఎన్నికలో పొత్తులు, అవగాహనలపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా, ఈ మూడు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందా, లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.