Begin typing your search above and press return to search.

'బాప్ ఆప్‌ పేపర్ లీక్'... కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫ్లెక్సీలు

ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ నాయ‌కుడు.. కేటీఆర్‌ను ఉద్దేశించి హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా 'బాప్ ఆప్ పేప‌ర్ లీక్‌' అంటూ ఫ్లెక్సీల‌ను అంటించారు. కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

By:  Garuda Media   |   24 July 2026 2:47 PM IST
బాప్ ఆప్‌ పేపర్ లీక్... కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫ్లెక్సీలు
X

తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీలో విద్యార్థులు చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌కు అనుబంధంగా తెలంగాణ‌లో అధికార పార్టీ కాంగ్రెస్ నాయ‌కులు గ‌త బీఆర్ఎస్ పాల‌న‌లో జ‌రిగిన పేప‌ర్ లీకుల‌ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ నాయ‌కుడు.. కేటీఆర్‌ను ఉద్దేశించి హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా 'బాప్ ఆప్ పేప‌ర్ లీక్‌' అంటూ ఫ్లెక్సీల‌ను అంటించారు. కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

కేటీఆర్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చామంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీల రూపంలో కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లేకేజీలను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలపై ప‌లు ప్ర‌శ్న‌లు రాసి వాటికి స‌మాధానం చెప్పాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు డిమాండ్ చేశారు. ''మీ పాలనలోని పేపర్ లీకులపై ఏం చెప్తారు'' అటూ కేటీఆర్‌ని ఫ్లెక్సీల‌లోనే నిల‌దీశారు. అప్ప‌ట్లోనూ అనేక మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. అయితే.. వాటిని బ‌య‌ట‌కు రాకుండా అప్ప‌టి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తొక్కిపెట్టింద‌ని ఆరోపించారు.

ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి సైతం.. బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా విద్యా ర్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే బీఆర్ ఎస్ ఎందుకు మౌనంగా ఉంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బీజేపీతో బీఆర్ ఎస్ కు ఉన్న తెర‌చాటు సంబంధాల కార‌ణంగానే ఇప్పుడు ఆ పార్టీ ప్ర‌శ్నించ‌లేక‌పోతోంద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఇలాంటి పార్టీలు రాష్ట్రానికి అవ‌స‌రమా? అని ప్ర‌శ్నించారు. విద్యార్థుల ప‌క్షాన మాట్లాడే హ‌క్కు కానీ.. వారి త‌ర‌ఫున ప్ర‌శ్నించే హ‌క్కు కానీ కేటీఆర్‌కు లేవ‌ని సీఎం అన్నారు.

మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా త‌న నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌కు కొన‌సాగింపుగానే త‌మ నిర‌స‌న కొన‌సాగుతోంద‌ని నాయ‌కులు తెలిపారు. మోడీ సెల్ఫీ వీడియోలు ఎన్ని చేసినా.. ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌ర‌ని.. ఆయ‌న మాట‌లు కాదు.. ఇప్పుడు చేత‌ల‌కు దిగాల‌ని పార్టీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాగా.. జిల్లాల్లో చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో మంత్రులు పాల్గొన్నారు. ప‌లుచోట్ల పోలీసుల‌కు, నాయ‌కుల‌కు వాగ్వాదం చోటు చేసుకుంది.