కేటీఆర్, హరీశ్ ను బిగ్ బాస్ లోకి తీసుకోవాలట..కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ లోకి నాగార్జున
‘మనిషిన్నాక కుసింత కళాపోసన ఉండాలబ్బా?’ అని మన రావు గోపాల్ రావు గారు అప్పట్లోనే చెప్పారు.
By: A.N.Kumar | 26 Dec 2025 8:20 PM IST‘మనిషిన్నాక కుసింత కళాపోసన ఉండాలబ్బా?’ అని మన రావు గోపాల్ రావు గారు అప్పట్లోనే చెప్పారు. ఈ మధ్య తెలంగాణ పాలిటిక్స్ చూస్తేనే సెగలు, పొగలు కనిపిస్తున్నాయి. హఠాత్తుగా రెండేళ్ల తర్వాత ఫాంహౌస్ తలుపులు తీసుకొని కేసీఆర్ బయటకు రావడం.. రాగానే కాంగ్రెస్ మీద పడిపోవడంతో ఈ చలికాలంలో ఆ మాటల మంటలు అంటుకున్నాయి. కేసీఆర్ అగ్గిరాజేస్తే అందులో రేవంత్ రెడ్డి కాస్త పెట్రోల్ పోసేసి మంట రేపాడు. ఇది అక్కడితో ఆగుతుందా? ఈరోజు కేటీఆర్ బయటకొచ్చి రేవంత్ రెడ్డిని చెడమడా తిట్టేశాడు. దీంతో ఎన్నడూ లేనంతా హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి.
చలికాలం కదా ఈ వేడిలో చాలా మంది చలి కాచుకుంటున్నారు. కొందరు మీమ్స్, ట్రోల్స్ చేస్తూ కేసీఆర్, రేవంత్ రెడ్డి మాటలతో సోషల్ మీడియాలో సందడిచేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్లు ప్రస్తుతం పతాకస్తాయికి చేరుకున్నాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో హరీష్ రావు, కేటీఆర్ కు అవకాశం కల్పించాలని ఆయన హీరో నాగార్జునకు లేఖ రాయడం సంచలనమైంది.
అయితే ఆ లేఖలో హరీష్ రావు, కేటీఆర్ లు రాజకీయాల్లో మంచి నటులుగా పేరు ప్రఖ్యాతి సంపాదించారని పేర్కొన్నారు. ప్రజలకు అబద్దాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. నటనకే నాట్యం నేర్పిన వారు.. నవరసాలు పండించడంలో వారికి వారే సాటి అంటూ సెటైర్లు వేశారు. ఆస్కార్ ను సైతం ఆశ్చర్యపరిచే నటన వారిదంటూ ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాపం వారి సొంతమని.. ఇలాంటి చక్కని నటీనటులకు బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం కల్పిస్తే అందరికీ మంచి ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుందంటూ సాయి కుమార్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ అటు బుల్లితెర ఇండస్ట్రీలోనూ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హల్ చల్ చేస్తోంది.
మీరు మీరు కొట్టుకోండి.. కానీ మధ్యలో పాపం బిగ్ బాస్ యాజమాన్యం.. వివాదాలకు దూరంగా ఉండే నాగార్జుననే లాగడం ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇప్పటికే కొండా సురేఖ కామెంట్లతో నాగార్జున కుటుంబం కోర్టుకెక్కి పోరాడి విరమించుకుంది. రాజకీయాల్లోకి నాగార్జున సామారస్యంగా ఉంటున్నారు. ఇటీవలే రేవంత్ తో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇలా రాజకీయవేడిలో సినిమా నటులను, ఎంటర్ టైన్ మెంట్ ను లాగడంపైనే కొందరు కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మరి ఈ రాజకీయ వేడి రాజకీయాలకే పరిమితం కాకుండా సినిమా వాళ్లకు చుట్టుకుంటుందా? ఇది ఎంతవరకూ సాగుతుందన్నది వేచిచూడాలి.
