కరీంనగర్‌లో 'రాజకీయ' రచ్చ: గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. రణరంగంగా జిల్లా
ఇటీవల కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయన డ్రగ్స్ టెస్టుకు రావాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి.
By: A.N.Kumar | 7 May 2026 6:14 PM ISTఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష ఘర్షణలకు దారితీసి రాష్ట్ర రాజకీయాల్లో భారీ కలకలం రేపుతోంది. కేటీఆర్‌పై బండి సంజయ్ చేసిన డ్రగ్స్ ఆరోపణలతో మొదలైన వివాదం.. ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ సమరంగా మారిపోయింది. పరస్పర ఆరోపణలు, దాడులు, నిరసనలు, పోలీసుల జోక్యంతో కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయన డ్రగ్స్ టెస్టుకు రావాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “డ్రగ్స్ అంటూ మాట్లాడే ముందు బండి సంజయ్ కూడా తానే ముందుగా టెస్టుకు రావాలి. తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే ఆయనకు బట్టతల వచ్చింది” అంటూ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేశాయి. అంతేకాదు.. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం భార్య పుస్తెలు అమ్ముకున్నానని చెప్పుకున్న బండి సంజయ్ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని కూడా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి అక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కార్యాలయాన్ని ముట్టడించినట్లు సమాచారం. అక్కడ నిలిపి ఉన్న కార్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారనే సమాచారం వెలువడింది. “బండి సంజయ్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలి” అంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో నినాదాలు చేశారు.
ఘటన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించే సమయంలో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి మరింత విషమించకుండా పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అనంతరం గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. కరీంనగర్ పట్టణంలో హై అలర్ట్ ప్రకటించి, అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇదిలా ఉండగా బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ మండిపడుతుండగా.. కేంద్ర మంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కౌశిక్ రెడ్డి మాత్రం తనపై హత్యాయత్నం జరిగిందని, బండి సంజయ్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ దాడుల వెనుక ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం డ్రగ్స్ ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మాటల దాడులు ఇప్పుడు భౌతిక ఘర్షణలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకులు తమ భాషను నియంత్రించుకోకపోతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్‌లో కొనసాగుతున్న ఈ రాజకీయ రచ్చ ఇకపై ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
