Begin typing your search above and press return to search.

రేవంత్ బుజ్జగింపులు.. ఆ ఇద్దరికీ పదవులు.. కోమటిరెడ్డికి మళ్లీ ఝలక్

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డికి ఈ సలహాదారు పదవి మంత్రి స్థాయి హోదాతో సమానం.

By:  A.N.Kumar   |   31 Oct 2025 6:50 PM IST
రేవంత్ బుజ్జగింపులు.. ఆ ఇద్దరికీ పదవులు.. కోమటిరెడ్డికి మళ్లీ ఝలక్
X

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అజహరుద్దీన్‌కు మాత్రమే అవకాశం దక్కడంతో, మంత్రి పదవుల ఆశావహులు నిరాశ చెందారు. అయితే, అసంతృప్తిని తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపులకు దిగి, కొందరు కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. ఇది రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అనుసరించిన ‘సమతుల్య రాజకీయ వ్యూహం’గా కనిపిస్తోంది.

* సలహాదారుగా సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదా

మంత్రి పదవిని గట్టిగా ఆశించిన బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి కీలక నియామకం లభించింది. ఆయనకు ప్రభుత్వం ప్రధాన సలహాదారుగా నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన జీవో నంబర్ 142 ప్రకారం, సుదర్శన్ రెడ్డి ఆరు గ్యారంటీలు ‘మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత’ వంటి ముఖ్య పథకాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డికి ఈ సలహాదారు పదవి మంత్రి స్థాయి హోదాతో సమానం. ప్రస్తుత నియామకం తాత్కాలికమేనని, త్వరలో ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా సుదర్శన్ రెడ్డిని శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

* ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన మరో ముఖ్య నేత, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా నామినేటెడ్ పదవిని కేటాయించారు. ఆయనను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచినందుకు ఈ పదవిని బహుమతిగా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

* కోమటిరెడ్డికి మళ్లీ నిరాశ

ఈ బుజ్జగింపుల పర్వంలో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మళ్లీ ఝలక్ తగిలినట్టే. ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కకపోగా, నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో ఆయన పార్టీపై విమర్శాత్మక వ్యాఖ్యలు చేయడం, క్రమశిక్షణ ఉల్లంఘించడం వంటి కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ పరిణామంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

మొత్తం మీద, మంత్రి పదవులు దక్కని కీలక నేతల అసంతృప్తిని తాత్కాలిక పదవులతో తగ్గించి, పాలనపై దృష్టి సారించేలా రేవంత్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే కోమటిరెడ్డికి మాత్రం ఎలాంటి పదవి ఇవ్వకుండా, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమనే బలమైన సంకేతాన్ని పంపింది.