తెలంగాణ పోలీసులకు హ్యాకర్ల ఝలక్.. పది రోజులుగా వెబ్‌సైట్లు డౌన్!
హ్యాకింగుకు గురైన రెండు వెబ్‌సైట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ఐటీ నిపుణులు శ్రమిస్తున్నారు.
By: Tupaki Political Desk | 4 Dec 2025 3:15 PM ISTతెలంగాణలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎంవో వాట్సాప్ గ్రూప్, హైకోర్టు వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన దుండగలు.. తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల వెబ్‌సైట్లను హ్యాక్ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. హ్యాకర్ల దెబ్బకు గత పది రోజులుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో వెబ్‌సైట్లు పనిచేయడం లేదు. హ్యాకర్లు పోలీసు వెబ్‌సైట్లలో మాల్ వేర్ చొప్పించి హ్యాకింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు వెబ్‌సైట్ ను క్లిక్ చేస్తే, గేమింగ్ అప్లికేషన్లు ఓపెన్ అవుతున్నాయి. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సర్వర్లను డౌన్ చేశారు. ఫలితంగా గత పది రోజులుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో వెబ్‌సైట్లు పనిచేయడం లేదు.
హ్యాకింగుకు గురైన రెండు వెబ్‌సైట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ఐటీ నిపుణులు శ్రమిస్తున్నారు. ఈ వెబ్‌సైట్లను ఎన్ఐసీ ((National Informatics Centre) నిర్వహిస్తోంది. మాల్ వేరో చొరబడిందని గుర్తించిన వెంటనే పోలీసులు ఎన్ఐసీకి సమాచారం ఇచ్చారు. హ్యాకింగ్‌కు కారణమైన ముఠాలను గుర్తించడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి ఎన్ఐసీ బృందం పనిచేస్తోంది. వెబ్‌సైట్లను త్వరలోనే పునరుద్ధరిస్తామని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే, మరింత నష్టం జరగకుండా భద్రతా లోపాలను సరిచేయడానికి ఐటీ విభాగం అధికారులు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు.
భవిష్యత్తులో మళ్లీ హ్యాకింగుకు గురికాకుండా రెండు కమిషనరేట్ల పోలీస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారు. అధునాతన ఫైర్‌వాల్స్ ఆడిట్ చేస్తున్నట్లు ఐటీ నిపుణులు వెల్లడించారు. ఆడిహ్యాకింగ్‌కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ సర్వర్‌ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఇదే తరహాలో పలు ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లు కూడా హ్యాక్ అయినట్లు సమాచారం. ఇప్పటికే డార్క్ వెబ్‌లో 22 వెబ్‌సైట్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
ఇదేవిధంగా గత నెలలో సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసే సమయంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయినట్లు హైకోర్టు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన హైకోర్టు రిజిస్ట్రార్ నవంబరు 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ విభాగాలు హ్యాకింగుకు గురికావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సైబర్ క్రైం నిపుణులు వెంటనే సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు.
