దసరాకు ముందే తెలంగాణకు కొత్త డీజీపీ
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి జితేందర్ ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 21 Sept 2025 12:15 PM ISTప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి జితేందర్ ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై చర్చ గడిచిన కొద్దికాలంగా నడుస్తూనే ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీవీ ఆనంద్ వర్సెస్ శివధర్ రెడ్డిల మధ్యే నెలకొందని చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావటం.. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుకావటంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతానికి ప్రభుత్వం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరిస్తున్న శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. మరోవైపు ఆయనకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్. ఒకవేళ శివధర్ రెడ్డిని డీజీపీగా నిర్ణయిస్తే.. సీవీ ఆనంద్ ను విజిలెన్స్ డీజీగా.. ఏసీబీ చీఫ్ బాధ్యతలు అప్పగించే వీలు ఉందని చెబుతున్నారు. అయితే.. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏసీబీ.. విజిలెన్స్ డీజీగా సీవీ ఆనంద్ పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
శివధర్ రెడ్డికి రిటైర్మెంట్ దగ్గరగా ఉండటం.. సీవీ ఆనంద్ కు ఎక్కువ కాలం ఉన్న నేపథ్యంలో ఇద్దరికి డీజీపీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతానికి శివధర్ రెడ్డికి డీజీపీ హోదా కట్టబెట్టి.. సీవీ ఆనంద్ ను గౌరవప్రదంగా పోలీసు శాఖతో సంబంధం లేకుండా ప్రభుత్వ పరిధిలో ఉంటూ తన బాధ్యతల్ని నిర్వర్తించే వీలు ఆనంద్ కు ఉంటుంది.
ఇదిలా ఉంటే పోలీస్ బాస్ పోస్టుకు శిఖాగోయల్ కూడా పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. డీజీపీకి పోటీ పడుతున్న వారిలా ఉంటే.. హైదరాబాద్ మహానగర పోలీసు కమిషన్ పోస్టుకు సైతం భారీ పోటీ నెలకొని ఉంది. సీవీ ఆనంద్ బదిలీ అయితే.. ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జన్నార్ .. ప్రస్తుతం శాంతిభద్రతల అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్ ప్రధానంగా పోటీ పడుతున్నట్లుగా చెప్పాలి. వీరితో పాటు చారుసిన్హా.. డీఎస్ చౌహాన్.. నాగిరెడ్డిలు కూడా పోటీ పడుతున్నారు.
వీరితో పాటు వీవీ శ్రీనివాస్.. స్వాతిలక్రా.. సంజయ్ కుమార్ జైన్.. స్టీఫెన్ రవీంద్రలు కూడా హైదరాబాద్ సీపీ పోస్టుకు అర్హులుగా ఉన్నారు. వీటిలో సజ్జన్నార్ పేరు హైదరాబాద్ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అనిల్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. సైబరాబాద్ సీపీ సైతం బదిలీ అయ్యే అవకాశం ఉందని..దీనికి సుమితితో పాటు.. తరుణ్ జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా దసరాకు ముందు పోలీసుశాఖకు సంబంధించిన భారీ బదిలీలు ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.
