Begin typing your search above and press return to search.

డీజే ఎఫెక్ట్‌: తెలంగాణ పోలీసుల వినూత్న అవ‌గాహ‌న!

డీజే సౌండ్ శ‌బ్దాల‌కు ఆగిపోతున్న గుండెలు ఓవైపు.. అయినా.. డీజేల కోసం ప‌రుగులు పెడుతున్న యువ‌త మ‌రోవైపు!.

By:  Garuda Media   |   21 Sept 2026 9:56 PM IST
డీజే ఎఫెక్ట్‌:  తెలంగాణ పోలీసుల వినూత్న అవ‌గాహ‌న!
X

డీజే సౌండ్ శ‌బ్దాల‌కు ఆగిపోతున్న గుండెలు ఓవైపు.. అయినా.. డీజేల కోసం ప‌రుగులు పెడుతున్న యువ‌త మ‌రోవైపు!. ఈ రెండు విష‌యాలు స‌మాజాన్ని ఇప్పుడు సందేహంలో నూ ఆలోచ‌న‌లోనూ ప‌డేస్తున్నాయి. డీజే లేకుండా వినాయ‌క నిమ‌జ్జ‌నం ఏంట‌నే యువ‌త‌ను క‌ట్ట‌డి చేయ‌లేక పోలీసులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు.. డీజే శ‌బ్దాల ఎఫెక్ట్‌తో య‌వ‌త గుండెలు ఆగిపోతున్నాయి. అయినా.. మార్పు రావ‌డం లేదు. ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు కొంద‌రు యువ‌కులు విన్న‌పాలు స‌మ‌ర్పించారు. తాము చేప‌ట్టిన నిమ‌జ్జ‌నోత్సవ ఘ‌ట్టాల‌కు డీజేకి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని.. అనుమ‌తిఇచ్చేలా చూడాల‌న్నారు. అయితే.. ఆయ‌న ప‌లు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను వారి ముందు ఉంచి.. డీజే లేకుండా నే నిమ‌జ్జ‌నం చేసుకోవాల‌ని సూచించారు.

కానీ, ఇలా ఎంత మంది నాయ‌కులు హితవు ప‌లుకుతారు?. అందుకే.. యువ‌త‌కు హిత‌వు ప‌లికేందుకు, డీజే మోత‌ల‌తో జ‌రుగుతున్న న‌ష్టాల‌ను వివ‌రించేందుకు.. తెలంగాణ పోలీసులు వినూత్న ప్ర‌య‌త్నం చేశారు. సికింద్రాబాద్‌లోని గోపాల‌పురం పోలీసు స్టేష‌న్ సీఐ ఆధ్వ‌ర్యంలో ఓ వీడియో సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దీనిలో సీఐ సురేష్ యూనిఫాంలోనే ఓ గీతాన్ని ఆల‌పించారు. `యాలాలో యాలాలో.. డీజే సౌండ్ మ‌న‌కొద్దురో!`` అని సాగుతూ పాడిన పాట‌.. యువ‌త‌ను డీజేకి దూరం చేయగ‌ల‌ద‌ని పోలీసులు ఆశిస్తున్నారు. ఈ గీతంలో డీజే సౌండ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ఆగిన గుండెల క‌థ‌ను కూడా వివ‌రించారు.

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై ఎంతో ప్రేమ‌ను పెంచుకుంటార‌ని.. కుటుంబాల‌కు ఆస‌రాగా నిలుస్తార‌ని ఆకాంక్షిస్తార‌ని గీతంలో పొందు ప‌రిచారు. కానీ.. అకార‌ణంగా డీజే సౌండ్‌తో గుండెలు ఆగుతున్నాయ‌ని.. డీజేకి దూరంగా ఉండాల‌ని సూచించారు. అదేస‌మ‌యంలో సంప్ర‌దాయ సంగీత ప‌రిక‌రాల‌పై డోలు, స‌న్నాయి, మ‌ద్దెలను వినియోగించాల‌ని సూచించారు. ఈ వీడియోలో `త‌మ్ముడా` అంటూ ప‌లు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. చ‌ట్ట ప్ర‌కారం డీజేని బ‌హిరంగ ప్రాంతాల‌లో పెట్ట‌డం నేర‌మ‌ని.. ఈ కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు ప‌డ‌వొద్ద‌ని కూడా సూచించారు. అటు ఆరోగ్యానికి,ఇటు ప్రాణాల‌కు, ఇంకోవైపు చ‌ట్టానికి కూడా ఇబ్బందిక‌ర‌మైన డీజే లేకుండా.. గ‌ణ‌ప‌తితోనే తీన్మానం చేసుకుంటూ ముందుకు సాగాల‌ని ఈ గీతం హితవు ప‌లికింది.