Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మాజీ మంత్రుల హౌస్ అరెస్ట్‌.. రీజ‌నేంటి?

బుధ‌వారం ఉద‌యం తెల‌తెల‌వారుతుండ‌గానే తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయిపోయారు.

By:  Garuda Media   |   19 Aug 2026 3:37 PM IST
తెలంగాణ‌లో మాజీ మంత్రుల హౌస్ అరెస్ట్‌.. రీజ‌నేంటి?
X

బుధ‌వారం ఉద‌యం తెల‌తెల‌వారుతుండ‌గానే తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయిపోయారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు .. హ‌రీష్ రావు, స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌హా.. ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌ను గృహ‌నిర్బంధం చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా వారిని హౌస్ అరెస్టు చేస్తున్న‌ట్టు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోకాపేట‌లోని హ‌రీష్‌రావు ఇంటికి వెళ్లిన డీసీపీ స్థాయి అధికారి.. ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. దానిని తీసుకునేందుకు హ‌రీష్‌రావు నిరాక‌రించారు.

ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా.. నియంతృత్వంలో ఉన్నామా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు తాము డ్యూటీ చేస్తున్నామ‌ని డీసీపీ బ‌దులిచ్చారు. అనంత‌రం.. నోటీసులు తీసుకున్న హ‌రీష్‌రావు.. సంత‌కం మాత్రం చేయ‌లేదు. ఇక‌, స‌బిత, త‌ల‌సాని ఇళ్ల‌కు వెళ్లిన స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్లు.. వారికి కూడా నోటీసులు ఇచ్చారు. గృహ‌నిర్బంధంలో ఉంచారు. ప‌దుల సంఖ్య‌లో పోలీసుల‌ను వారి ఇళ్ల ముందు మోహ‌రించారు. ఈ స‌మ‌యంలో త‌ల‌సాని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు.

కార్య‌క‌ర్త‌ల మోహ‌రింపు..

హ‌రీష్‌రావును హౌస్ అరెస్టు చేసిన విష‌యం తెలిసిన బీఆర్ఎస్ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆయ‌న నివాసానికి చేరుకుని పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. హౌస్ అరెస్టుల‌ను ఖండించారు. అయితే.. పోలీసులు వారిని బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. రోప్ పార్టీ కూడా రంగంలోకి దిగి కార్య‌క‌ర్త‌ల‌ను రాకుండా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌దుల సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు హ‌రీష్ రావు ఇంటి ముందుకు చేరారు.

ఎందుకు?

స‌న‌త్ న‌గ‌రంలోని టిమ్స్ ఆసుప‌త్రిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై గ‌త కొన్నిరోజులుగా ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఈ రోజు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. దీనికి అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ తాము వెళ్తామ‌ని వారు చెప్ప‌డంతో ముందుగానే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. వారిని గృహ‌నిర్బంధం చేయ‌డం గ‌మ‌నార్హం.