Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్: హరీశ్ రావుకు సిట్ నోటీసులు

ఒక ప్రముఖ ప్రైవేటు ఛానెల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   20 Jan 2026 9:23 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్: హరీశ్ రావుకు సిట్ నోటీసులు
X

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేశారు.

విచారణకు రావాలని ఆదేశం

ఈ నోటీసుల ప్రకారం హరీశ్ రావు మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. గత కొంతకాలంగా ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నాయకుల వైపు దృష్టి సారించడం గమనార్హం.

నోటీసులకు గల కారణాలు

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో హరీశ్ రావు పాత్రపై కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ ప్రైవేటు ఛానెల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం.. గతంలో రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్లు ఈ పరిణామానికి దారితీశాయి. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా లబ్ధి పొందారనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది.

సుప్రీం కోర్టు సీరియస్.. దర్యాప్తు వేగవంతం

ఇటీవల ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా స్పందించింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ విషయంలో దర్యాప్తు సంస్థలను ప్రశ్నించిన ధర్మాసనం, విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సిట్ అధికారులు దూకుడు పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

హరీశ్ రావుకు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని గులాబీ దళం ఆరోపిస్తుండగా తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అధికార పక్షం వాదిస్తోంది. రేపు హరీశ్ రావు విచారణకు హాజరవుతారా? లేదా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? ఈ విచారణ తర్వాత మరికొంత మంది కీలక నేతలకు నోటీసులు వచ్చే అవకాశం ఉందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. విచారణ అనంతరం ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.