'చెప్పింది చేయకపోతే..చెప్పులు కట్టుకుని తిరుగుతా'
కానీ, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి సాగుతున్నాయి. దీంతో పంచాయతీల్లో వాగ్దానాలు, హామీలు సహా.. బాండు పేపర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి.
By: Garuda Media | 10 Dec 2025 6:00 AM ISTఇదేదో సినిమా డైలాగు కాదు. ఎవరో పోకిరీలు చేసిన కామెంట్లు కూడా కావు. సాక్షాత్తూ గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్ని కల్లో నిలబడిన సర్పంచ్ అభ్యర్థులు.. ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు చేస్తున్న వాగ్దానం. ఒక చోట కాదు.. రెండు నుంచి మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా ``చెప్పింది చేస్తాం. చేయకపోతే.. ఇంటికో చెప్పు మెడలో కట్టుకుని తిరుగుతాం`` అని ప్రజలకు చెబుతున్నారు. నిజానికి ఇంత సంచలన వాగ్దానం.. సాధారణ ఎన్నికల్లోనే మనకు వినిపించదు.
కానీ, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి సాగుతున్నాయి. దీంతో పంచాయతీల్లో వాగ్దానాలు, హామీలు సహా.. బాండు పేపర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. అక్కడా ఇక్కడా అని కాదు.. ప్రధాన పోటీ నెలకొన్న ప్రతి గ్రామ పంచాయతీలోనూ వాగ్దానాల పర్వం కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సమయంలో తమ గెలుపుపై తీవ్ర తర్జన భర్జన పడుతున్న నాయకులు.. ఈ తరహా హామీలను గుప్పిస్తున్నారు.
+ ఈ వాగ్దానాల పరంపర ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. మంచిర్యాల జిల్లాలోని మాలగురిజాల గ్రామ సర్పంచిగా పోటీలో ఉన్న శ్యామలత ఏకంగా20 వాగ్దానాలతో 100 రూపాయల బాండు పేపర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఆమె గెలిస్తే.. ఇంటి పన్నులు మాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. వాస్తవానికి గ్రామ పంచాయతీలకు పన్నులు, సిస్తులే కీలకం. మరి ఆమె ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు విశ్వసిస్తారో లేదో చూడాలి.
+ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుడితండా గ్రామ పంచాయతీ సర్పంచిగా బరిలో ఉన్న జైపాల్.. తాను సర్పంచిగా గెలిచిన తర్వాత.. రూపాయి అవినీతికి కూడా పాల్పడనని రూ.100 రెవెన్యూ స్టాంపుపై హామీ ఇచ్చారు. ఒకవేళ రూపాయి అవినీతికి పాల్పడినా.. తన ఆస్తులు జప్తు చేసుకునేలా హక్కులు కూడా కల్పించారు.
+ ఇక, కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రమంంలో మరో వినూత్న వాగ్దానం తెరమీదికి వచ్చింది. ఇక్కడి సర్పంచ్ పోరులో ఉన్న రాజేశ్వరి.. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే `కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని తిరుగుతా` అని హామీ ఇచ్చారు. అంతేకాదు.. తన పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. మొత్తానికి ఈ వాగ్దానాల పర్వంలో పంచాయతీ ఎన్నికలు వేడివేడిగా సాగుతున్నాయి.
