కాంగ్రెస్ దే మెజార్టీ 'పంచాయితీ'.. ఫలితాలు ఇవీ
ఎన్నికలు జరిగిన వాటితోపాటు ఏకగ్రీవం అయిన వారందరినీ కలిపి చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1100 స్థానాల్లో పీఠం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో 500కి పైగా , బీజేపీ ఖాతాలో 90కి పైగా స్తానాలు వెళ్లాయి.
By: A.N.Kumar | 11 Dec 2025 9:58 PM ISTతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పంచాతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీ, స్వతంత్ర్య అభ్యర్థులు గెలిచారు. మరికొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యం
తెలంగాణలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో 3834 సర్పంచ్ పదవులకు 12960 మంది అభ్యర్థులు, 2762 వార్డు సభ్యుల స్థానాలకు 65455 మంది పోటీ పడ్డారు. సాయంత్రం 6 గంటల నాటికి రిపోర్ట్స్ ప్రకారం.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 750కి పైగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇక 350 పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులు 180కి పైగా చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 70కి పైగా గ్రామాల్లో సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే 300 కు పైగా ఉన్నారు. 40కిపైగా చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇతరులు 39 చోట్ల పోటీ లేకుండా సర్పంచులుగా ఎన్నికయ్యారు.
ఎన్నికలు జరిగిన వాటితోపాటు ఏకగ్రీవం అయిన వారందరినీ కలిపి చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1100 స్థానాల్లో పీఠం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో 500కి పైగా , బీజేపీ ఖాతాలో 90కి పైగా స్తానాలు వెళ్లాయి. 200కు పైగా స్థానాల్లో ఇతరులు గెలిచారు.
లెక్కింపు సరళిని బట్టి పలు జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల రీకౌంటింగ్ కూడా జరుగుతున్నాయి. పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దారు. అర్ధరాత్రిలోపే అన్ని పంచాయితీల ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు. కానీ రాజకీయ పార్టీలు అభ్యర్థులను తమ పార్టీ తరుఫున బలపరుస్తుంటాయి. వాటి ఆధారంగానే ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారనే దాని మీద ఓ అంచనాకు పార్టీలు వస్తాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇక చివరివిడత ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన ఉంటాయి. దీంతో పంచాయితీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
