Begin typing your search above and press return to search.

పంచాయ‌తీ పోరు: తొలి ద‌శ స‌మాప్తం.. 50 ల‌క్ష‌లు ప‌లికిన‌ ప‌ద‌వి!

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల పోరుకు సంబంధించిన తొలిద‌శ నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసింది. గురువారం ఉద‌యం 8 గంట‌ల నుంచి ప్రారంభ‌మైన ఈ ప్ర‌క్రియ శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సాగింది.

By:  Garuda Media   |   30 Nov 2025 4:00 AM IST
పంచాయ‌తీ పోరు:  తొలి ద‌శ స‌మాప్తం.. 50 ల‌క్ష‌లు ప‌లికిన‌ ప‌ద‌వి!
X

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల పోరుకు సంబంధించిన తొలిద‌శ నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసింది. గురువారం ఉద‌యం 8 గంట‌ల నుంచి ప్రారంభ‌మైన ఈ ప్ర‌క్రియ శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సాగింది. అయితే.. ఆశించిన మేర‌కు స్పంద‌న లేద‌న్న‌ది అధికారుల నుంచి కూడా వినిపిస్తున్న మాట‌. రాజ‌కీయంగా ఒక‌ప్పుడు పంచాయ‌తీల్లో పెద్ద‌గా డ‌బ్బుల స‌మ‌స్య వ‌చ్చేది కాదు. కానీ, తాజా ఎన్నిక‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు డ‌బ్బుల క‌ట్ట‌లు తెగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చాలా మంది పోటీ నుంచి త‌ప్పుకొన్నారు. ఫ‌లితంగా స‌ర్పంచు, ఉప స‌ర్పంచు ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా స్పంద‌న క‌నిపించ‌డం లేదు.

ఇక‌, తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి 4,236 గ్రామపంచాయతీలను ఎంపిక చేశారు. వీటిలో స‌ర్పంచ్‌, ఉప స‌ర్పం చ్ ఎన్నిక‌ల పోలింగ్ వ‌చ్చే నెల 11న జ‌ర‌గ‌నుంది. అయితే.. వీటి నుంచి క‌నీసం 80 వేల నామినేష‌న్ల‌యినా వ‌స్తాయ‌ని ఎన్నిక‌ల అధికారులు ముంద‌స్తుగా అంచ‌నా వేసుకున్నారు. కానీ, శ‌నివారం సాయంత్రం నాటికి 37,440 నామినేష‌న్లు మాత్ర‌మే అందాయి. మ‌రికొన్ని పంచాయ‌తీల్లో ఏక‌గీవ్రం జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు. వీటిని ఆదివారం స్క్రూటినీ చేసి.. సోమ‌వారం అర్హ‌త పొందిన నామినేష‌న్ల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. అనంత‌రం.. డిసెంబ‌రు 3 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ఉంటుంది.

ఇదిలావుంటే.. డిసెంబ‌రు 2న రెండో విడ‌ద‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌చేయ‌నున్నారు. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. వీటిలోనూ వేలం పాట‌లు జ‌రుగుతున్నాయి. మ‌రికొన్ని పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవాలు జ‌రిగాయి. దీంతో ఆశించిన మేర‌కు ఇక్క‌డైనా నామినేష‌న్లు వ‌స్తాయో లేదో చూడాలి. ఇదిలావుంటే. ఇప్ప‌టికే ఖ‌మ్మ జిల్లాలో ఒక స‌ర్పంచ్ పోస్టును 20 ల‌క్ష‌ల రూపాయ‌ల పైచిలుకు మొత్తానికి ఒక వ్య‌క్తి పాడుకున్నారు.

తాజాగా నల్గొండ జిల్లా చిన్నఅడిశర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా వెంకటయ్య గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే.. ఇది ఏక‌గ్రీవం కాద‌ని.. 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఆయ‌న కొనుగోలుచేశార‌ని గ్రామ‌స్థులు చెబుతున్నారు. దీనిపై వెంక‌ట‌య్య మాట్లాడుతూ.. ఎలాంటి వేలం లేద‌ని.. త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే.. 50 ల‌క్ష‌ల రూపాయ‌ల గ్రామానికి ఇస్తాన‌ని చెప్పిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. ఈ గ్రామంలో మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.