Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్‌ల‌పై కేటీఆర్.. ఓ రేంజ్‌లో ఏకేశారుగా!

తెలంగాణలో పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌రానికి ఎన్నిక‌ల సంఘం తెర‌దీసిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   26 Nov 2025 4:37 PM IST
రిజ‌ర్వేష‌న్‌ల‌పై కేటీఆర్.. ఓ రేంజ్‌లో ఏకేశారుగా!
X

తెలంగాణలో పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌రానికి ఎన్నిక‌ల సంఘం తెర‌దీసిన విష‌యం తెలిసిందే. మొత్తం మూడు విడ‌త‌ల్లో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. అయితే.. రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై రాజ‌కీయ దుమారం రేగింది. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. కుల గ‌ణ‌న చేప‌ట్టి.. త‌ద్వారా రాష్ట్రంలో బీసీలు ఎక్కువ‌గా ఉన్నార‌ని గుర్తించింది.

ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. కానీ, ఇటు పాల‌న ప‌రంగా ఎలా ఉన్నా.. అటు న్యాయ‌ప‌రంగా ఇబ్బందులు వ‌చ్చాయి. ఇక‌, దీనికి రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్‌ల నుంచి ఎలాంటి ఆమోదం పొంద‌లేదు. ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ఒక ద‌ఫా వాయిదా వేశారు. కానీ, మ‌రోసారి వీటిని వాయిదా వేసే ప‌రిస్థితిలేదు. అలా చేస్తే.. నిధులు గ‌ల్లంత‌వుతాయి. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అయితే.. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చినా.. పాత రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అంటే.. మొత్తంగా 50 శాతానికి మించ‌కుండానే రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కానున్నాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ఆర్బాటంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌, ఆ త‌ర్వాత బీసీల‌కు అనుకూలంగా రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. ఆమోదించిన బిల్లు ఏమైంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఈ క్ర‌మంలోనే కుల గ‌ణ‌న చేప‌ట్టారు. దీనికి ప్ర‌జా ధ‌నాన్ని 160 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో బీసీల‌కు కేవలం 17 శాతం రిజర్వేషన్లకు ప‌రిమితం చేస్తున్నారు. గ‌తంలో మేం 24 శాతం అమ‌లు చేస్తే.. ఇప్పుడు వారిని 17 శాతానికి ప‌రిమితం చేశారు. ఇదేనా.. మీరు చేసేది?`` అని ప్ర‌శ్నించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.