Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ కోరినట్లుగా రూ.1100 కోట్లతో భారీ గుడి

జబ్బున పడితే సరైన వైద్యం చేసేందుకు సర్కారు దవాఖానాలు సరిగా ఉండవు. మంచిగా చదువు చెప్పే ఇస్కూళ్లు.. కాలేజీలు ఉండవు.

By:  Garuda Media   |   8 Oct 2026 3:39 PM IST
సీఎం రేవంత్ కోరినట్లుగా రూ.1100 కోట్లతో భారీ గుడి
X

జబ్బున పడితే సరైన వైద్యం చేసేందుకు సర్కారు దవాఖానాలు సరిగా ఉండవు. మంచిగా చదువు చెప్పే ఇస్కూళ్లు.. కాలేజీలు ఉండవు. కానీ.. దేవుడి పేరుతో వందలాది కోట్లు ఖర్చు పెట్టి గుళ్లు నిర్మించే తీరు పాలకల్లో పెరుగుతోంది. కారణం ఏమైనా కానీ.. గుళ్ల పేరుతో చేస్తున్న ఖర్చుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలోని తిరుమల శ్రీవారి టెంపుల్ కు మించి.. యాదాద్రిలో తాను గుడి కడతానని చెప్పి మరీ.. వందలాది కోట్లు ఖర్చు చేసి.. యాదాద్రిని అప్పటి కేసీఆర్ సర్కారు డెవలప్ చేస్తే.. తాజాగా రేవంత్ సర్కారు సైతం తాము తగ్గేదేలేదన్న రీతిలో ఓంకారేశ్వరాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.1108 కోట్ల భారీ ఖర్చుకు తెర తీశారు. ఇందులో ఓంకారేశ్వరాలయానికి రూ.948.65 కోట్లు ఖర్చు అయితే.. దానికి అనుబంధంగా ఉండే ఆలయాలు.. ఇతర వసతుల కోసం మిగిలిన నిధులను ఖర్చు చేస్తారు.

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై ఓంకారేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ప్రధాన దేవాలయాన్ని రూ.598.98 కోట్లు.. ఆలయం చుట్టూ భవనాలు.. వసతులు.. ఇతర డెవలప్ మెంట్ యాక్టివిటీల కోసం రూ.349.67 కోట్లు.. మూసీ ఒడ్డున రోడ్ల నిర్మాణానికి రూ.159.62 కోట్ల ఖర్చుకు ఓకే చేస్తూ తాజాగా పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకూ ఈ గుడిని ఎక్కడ నిర్మిస్తారన్న విషయంలోకి వెళితే.. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయటానికి సిద్ధం చేసిన డీపీఆర్ లో ఈ వివరాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి.. మచిలేశ్వరస్వామి ఆలయాల పక్క ఉన్న ఎనిమిది ఎకరాల్లో ఓంకారేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తారు. అందులోనే శ్రీ వీరభద్ర - భద్రకాళి టెంపుల్.. శ్రీ లలితా మహా త్రిపుర సందరీదేవి.. శ్రీ బాలగణపతి స్వామి.. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉండనున్నాయి.

గర్భాలయం ఎత్తు 64 అడుగులుగా చెబుతున్నారు. మహా మండపం 44 స్తంభాలతో నిర్మిస్తారు. కాకతీయ ఆలయనిర్మాణ మూలశైలితో ఉండే ఈ ఆలయం నాగర శైలి వాస్తుకళతో ఆలయ శిఖరాల్ని రూపొందిస్తారు. ఆలయ సముదాయం రెండు ప్రాకారాలతో.. నాలుగు దిక్కులా ఎనిమిది భారీ రాజగోపురాలతో ఏర్పాటు చేయనున్నారు. ముందు భాగంలో 91 అడుగుల ఎత్తు.. తొమ్మిది అంతస్తుల్లో మహా రాజగోపురాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆలయ నిర్మాణానికి రామప్ప దేవాలయ పరిసరాల్లో లభించే రాయిని ఉపయోగించనున్నారు.

ఆలయం చుట్టుపక్కల వంద అడగుల వెడల్పుతో రహదారిని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆలయాన్ని ఒక కొలిక్కి వచ్చేలా నిర్మాణ పనులు చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వంలో యాదాద్రి భారీ ఎత్తున పునర్ నిర్మిస్తే.. సీఎం రేవంత ఓంకారేశ్వరాలయం పేరుతో నిర్మిస్తున్న ఆలయం.. రానున్న రోజుల్లో మరో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.