Begin typing your search above and press return to search.

మూసీ ఒడ్డున ఓంకారేశ్వ‌రాల‌యం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ!

మూసీ నది ఒడ్డున ప్ర‌ఖ్యాత ఓం కారేశ్వ‌ర శివాల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకు స్థాప‌న చేశారు.

By:  Garuda Media   |   28 March 2026 6:38 PM IST
మూసీ ఒడ్డున ఓంకారేశ్వ‌రాల‌యం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ!
X

మూసీ నది ఒడ్డున ప్ర‌ఖ్యాత ఓం కారేశ్వ‌ర శివాల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకు స్థాప‌న చేశారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న ఈ ఆల‌య నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయితే.. ఇది హైద‌రాబాద్ కు కొంచెం దూరంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండ‌లంలోని మంచి రేవుల వ‌ద్ద నిర్మాణం కానుంది. ఈ ఆల‌యంలో చాలా ప్ర‌త్యేక‌త‌లే ఉంటాయి.

అచ్చంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని న‌ర్మ‌దాన‌ది తీరంలో ఉన్న ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఓంకారేశ్వ‌ర శివాల‌యాన్ని పోలిన నిర్మాణాన్నే ఇక్క‌డ చేప‌డ‌తారు. అంతేకాదు.. మూసీ న‌ది మ‌ధ్యంలో దాదాపు 100 అడుగుల ఎత్త‌యిన శివ విగ్ర‌హాన్ని నిర్మించ‌నున్నారు. మొత్తంగా ఆల‌యాన్ని 8 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నారు. దీనికి ప‌క్క‌నే వీర‌భ‌ద్ర స్వామి ఆల‌యం కూడా ఉంది.

ఈ మొత్తం ప్రాజెక్టును మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. దీనికిగాను రాష్ట్ర ప్ర‌భుత్వం 700 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఖ‌ర్చు చేయ‌నుంది. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి దగ్గర ఆధునిక గోశాలను కూడా నిర్మించ‌నున్నా రు. సుమారు వెయ్యి గోవుల‌కు ఇక్క‌డ షెల్ట‌ర్ క‌ల్పించ‌నున్నారు. ఇది కూడా తెలంగాణ‌లో ఫ‌స్ట్ టైమేన‌ని అధికారులు చెబుతున్నారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో కుటుంబ స‌మేతంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

మూసీ కోస‌మే..

మూసీ న‌ది అనగానే కాలుష్య కాసారం గుర్తుకు వ‌చ్చే రోజుల నుంచి ఇప్పుడు ఈ న‌దిని ప్ర‌క్షాళ‌న చేయ‌డం ద్వారా జీవ‌న‌దిగా మార్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగానే మూసీ న‌దిని బాగు చేయ‌డం తోపాటు.. న‌దీ ప్ర‌వాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాల‌ను కూడా తొలగిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా.. ఓం కారేశ్వ‌ర శివాల‌యానికి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. అయితే.. దీని వెనుక కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువు సూచనలు ఉన్న‌ట్టు తెలిసింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ ఈ ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించ‌నుంది. రెండేళ్ల కాల వ్య‌వ‌ధిలో అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ఆల‌యాన్ని పూర్తి చేయ‌నున్నారు.