Begin typing your search above and press return to search.

తెలంగాణలో మున్సిపల్ నగరా.. షెడ్యూల్ విడుదల..

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం అధికారికంగా విడుదల చేశారు.

By:  A.N.Kumar   |   27 Jan 2026 5:47 PM IST
తెలంగాణలో మున్సిపల్ నగరా..  షెడ్యూల్ విడుదల..
X

తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పోరుకు తెరలేచింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు , 116 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 28వ తేదీ బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

నామినేషన్ల స్వీకరణ: జనవరి 28 నుండి 30 వరకు.

నామినేషన్ల పరిశీలన: జనవరి 31న.

ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 3వ తేదీ వరకు.

పోలింగ్: ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

పరోక్ష ఎన్నికలు: ఫిబ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు , వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది.

బ్యాలెట్ విధానంలోనే పోరు

ఈ ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

కఠినంగా ఎన్నికల నిబంధనలు

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు చేయడంపై నిషేధం విధించారు. ప్రభుత్వ వాహనాలు, అధికార యంత్రాంగం రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాణికుముదిని హెచ్చరించారు. అభ్యర్థుల ఖర్చుపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ, అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి.

కవిత కొత్త పార్టీ ప్రభావం ఎంత? పోటీచేస్తుందా?

ఈ ఎన్నికల్లో మరో కీలక పరిణామం కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం. ఆమె తన అనుచరులను 'సింహం' గుర్తుపై స్వతంత్రులుగా బరిలోకి దించుతుండటంతో ఈ మున్సిపల్ పోరు మూడు ప్రధాన పార్టీలతో పాటు సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కానుంది.

మున్సిపల్ పోరులో గెలిచి పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించేది ఎవరనేది ఫిబ్రవరి 13న తేలనుంది.