కాంగ్రెస్ దూకుడు: మునిసిపల్ ఎన్నికల్లో.. 'జూబ్లీహిల్స్' వ్యూహం
వీరు ఆయా మునిసిపాలిటీలలో ఉన్న రాజకీయ సమీకరణలను అంచనా వేయడంతోపాటు.. ఎప్పటిక ప్పుడు వ్యూహాలు మార్చుకుని.. ప్రత్యర్థులకు దీటుగా కాంగ్రెస్‌ను ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
By: Garuda Media | 20 Jan 2026 6:00 AM ISTతెలంగాణలోని 117 మునిసిపాలిటీలు, ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు.. నేడో రేపో.. నోటిఫికేషన్ రానుంది. దీంతో ఆయా స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్ని తెరమీదికి తెచ్చింది. అప్పట్లో జూబ్లీహిల్స్‌లోని వార్డులను విభజించి.. మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
ప్రతి వార్డును ఒక మంత్రికి కేటాయించారు. సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకుని బలమైన మంత్రుల కు బాధ్యతలు కేటాయించడం ద్వారా.. విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాలకు.. ఇంచార్జ్‌లుగా(కేవలం ఎన్నికలకు) మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 15 మంది మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించారు.
వీరు ఆయా మునిసిపాలిటీలలో ఉన్న రాజకీయ సమీకరణలను అంచనా వేయడంతోపాటు.. ఎప్పటిక ప్పుడు వ్యూహాలు మార్చుకుని.. ప్రత్యర్థులకు దీటుగా కాంగ్రెస్‌ను ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అదేవిధంగా.. పార్టీ తరఫున బలమైన గళాన్ని కూడా వినిపించాలి. అంతేకాదు.. ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రచారం చేయాలి. విమర్శలను కూడా ఎదుర్కొనాలి. ఎలా చూసినా.. ఆయా మునిసిపాలిటీల్లో పార్టీ జెండాను ఎగరేయాలన్న లక్ష్యంతో మంత్రులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇవీ.. మంత్రులకు ఇచ్చిన జిల్లాలు..
మల్కాజిగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెళ్ల - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు,ఖమ్మం - కొండా సురేఖ, మహబూబాబాద్ - పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్ - దామోదర రాజనరసింహ, జహీరాబాద్ - అజారుద్దీన్, మెదక్ - వివేక్ వెంకటస్వామి, నాగర్‌కర్నూల్ - వాకిటి శ్రీహరి, నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి - సీతక్క, నిజామాబాద్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు.
