మూడ్ ఆఫ్ తెలంగాణా...రేవంత్ కి సగం బలమేనా ?
ఇక అగస్ట్ 2026 పేరుతో విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ లో భాగంగా తెలంగాణాలో పల్స్ ని ఈ సర్వే పట్టుకునే ప్రయత్నం చేసింది.
By: Satya P | 29 Aug 2026 9:45 AM ISTతెలంగాణా రాజకీయం ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ కి ఆదరణ తగ్గుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తాజాగా వచ్చిన సర్వేలో కాంగ్రెస్ బలాన్ని సగానికి సగం చేసింది అని అంటున్నారు. 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అయితే మొత్తం 17 ఎంపీ సీట్లకు గానూ తెలంగాణాలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది. మరో ఎనిమిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మజ్లీస్ ఒక్క సీటు దక్కించుకుంది. చిత్రంగా అంతకు ఎనిమిది నెలల ముందు దాకా అధికారంలో ఉంటూ బలంగా నిలిచిన బీఆర్ఎస్ ఒక్క సీటూ కూడా గెలుచుకోలేకపోయింది. దాంతో గులాబీ పార్టీ ప్రభావం ఏమీ లేదన్న భావనను ప్రత్యర్ధులు వ్యాప్తి చేయడం మొదలెట్టారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలు కూడా కారు పార్టీ ఇక ఇంతే సంగతులు అని కూడా సెటైర్లు వేశారు. మరోవైపు బీజేపీ మొత్తానికి మొత్తం సీట్లు వచ్చే సారి గెలుచుకుంటామని అంటూ వస్తోంది.
పెరిగిన కమలం :
ఇక అగస్ట్ 2026 పేరుతో విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ లో భాగంగా తెలంగాణాలో పల్స్ ని ఈ సర్వే పట్టుకునే ప్రయత్నం చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక మొత్తం 17 సీట్లలో బీజేపీకి 9 దక్కుతాయని వచ్చింది. అంటే ఒక సీటు అదనం అన్న మాట. ఈ రెండేళ్లలో ఆ విధంగా కమలం బలం పెరిగింది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కాంగ్రెస్ ఎనిమిది సీట్లలో సగానికి సగం నాలుగుకు పడిపోతోంది అని ఈ సర్వే చెప్పుకొచ్చింది. మరో నాలుగు సీట్లలో ఇతరులు అంటూ పేర్కొంది. అందులో మజ్లిస్ సీటుని ఒకటి తీసి పక్కన పెట్టినా బీఆర్ఎస్ కి మూడు ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే తెలియచేసిందా అన్నది చర్చగా ఉంది. అంటే 2024 ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కని బీఆర్ ఎస్ కి ఈసారి మూడు రావడం అంటే గొప్ప విషయమే అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఆశలు మరిన్ని ఎన్నికల్లో అధికారం వైపుగా ఉండగా బలం మాత్రం సగానికి పడిపోయింది అని సర్వే చెబుతోంది.
మారుతున్న ఆలోచనలు :
ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రజల నాడిని తెలియజేసే అనేక రకాలైన సర్వేలు మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు. తాజా సర్వే అంచనాలు కూడా అలాగే ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన నుంచి ఇటీవల కాలం వరకూ తీసుకుంటే పలు సర్వేలు వచ్చాయి. 2026 మధ్యలో సీ ప్యాక్ వంటి సంస్థలు నిర్వహించిన సర్వేలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సర్వేలు తెలంగాణా ప్రజల్లో మారుతున్న ఆలోచనలను వెల్లడించాయి. అలాగే పార్టీల బలాబలాలుకూడా మారుతున్నాయని విశ్లేషించాయి
గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి మెల్లగా ప్రజల్లో మళ్ళీ ఆదరణ పెరుగుతోందని కొన్ని సర్వేలు చెబుతూంటే బీజేపీకి ఆదరణ బాగా పెరుగుతోందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ కి తెలంగాణాలో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూంటే తాజా సర్వేతో తాము బలంగా ఉన్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళకు దగ్గర పడుతోంది. దాంతో ప్రజల అంచనాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు తీరు ఆధారంగా రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్లుగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికే అని ఎన్నికల వాతావరణం వేడెక్కాక అప్పటినిక పరిస్థితులను బట్టి ఫలితాలు మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
