సర్పంచూ గీ కోతుల్ని పంపు మల్ల....
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పోరు ముగిసింది. గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికతంతు పూర్తయింది. ఎన్నికలయ్యే దాకా...ఓటుకు పాతికవేల దాకా రేటు పలికిన వింత చూశాం.
By: Tupaki Political Desk | 19 Dec 2025 5:52 PM ISTఇగో సర్పంచూ నువ్ ఏం జేస్తవో మాకెరకలేదు...గీ కోతుల్ని యాడికన్నా ఎల్లగొట్టంతే...రోజూ వీటితాన మస్త్ పరేసానవుతుండది. మాకు జర నెమ్మది గావాలె. మిగిలిన కత తర్వాత సూసుడు...ముందయితే ఈ జాన్వర్లను జంగిల్ లోకి తోలే కతేందో సూడ్రాదే...అంటూ కొత్త సర్పంచులకు సరికొత్త సమస్యల్ని పల్లెప్రజలు ఏకరువు పెడుతుంటే సర్పంచులు బిక్కమొగం వేయాల్సి వస్తోంది. గ్రామానికి కొత్తగా ఎన్నికయిన సర్పంచులకు ఎన్నో సమస్యల్ని పరిష్కరించాలని కోరికగా ఉంటుంది. కొత్త సవాళ్ళను ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఉంటుంది. కానీ ఈ కోతుల గోలేంటి బాబోయ్...అంటే అదే కదా పంచాయతీ ఎలచ్చన్లో మాటిచ్చింది...మాకు గీ కోతుల్తాన అవుతలేదు...జర యాడికన్నా తోలేసి రా..అంటూ పల్లె ప్రజలు హుకుం జారీ చేస్తుంటే కొత్త సర్పంచులు బిత్తరపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పోరు ముగిసింది. గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికతంతు పూర్తయింది. ఎన్నికలయ్యే దాకా...ఓటుకు పాతికవేల దాకా రేటు పలికిన వింత చూశాం. అష్టకష్టాలు పడి ఎలాగోలా గెలిచిన సర్పంచులకు ఎన్నికల్లో తామిచ్చిన హామీల్లో ఏది నెరవేర్చినా నెరవేర్చకపోయినా...ఊర్లో కోతుల బెడద నుంచి తప్పించాలని రాష్ట్రంలో చాలా పల్లెల నుంచి ప్రధాన డిమాండ్ గా వినవస్తోంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కిష్కింద కాండ షురూ కాబోతోందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోతుల సమస్య తలనొప్పిగా మారుతోంది. ఆఖరుకిది గ్రామీణ జీవన విధానాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లిపోయింది. ఈ కోతుల నుండి మమ్మల్ని కాపాడండి మహా ప్రభో అంటూ ప్రజలు అధికారులకు అనేకమార్లు ఫిర్యాదులు చేస్తున్నా లాభం లేకపోవడంతో...పంచాయతీ ఎన్నికలే మంచి సందర్బమని ...వానర విమోచనోద్యమానికి శ్రీకారం చుట్టారు. సర్పంచినే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని పల్లెల ప్రజలు అడుగుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన రాజన్న సిరిసిల్లా జిల్లా కందికట్కూరు గ్రామా సర్పంచి ఎన్నికల్లో గెలిచిన వెంటనే కోతుల్ని తరిమేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచి చింతలపల్లి విజయమ్మ గెలవగానే .. కోతులు పట్టేవాళ్లను రప్పించి కోతుల్ని తరిమేసే పనిలో పడ్డారు. అలాగే నిర్మల్ జిల్ల కడెం మండలంలో లింగపూర్ గ్రామం నుంచి ఎన్నికైన కొత్త సర్పంచి రంజిత్ కోతుల్ని తరిమేయడం కోసం చింపాంజీ అవతారం ఎత్తారు. ఇంటింటికీ తలో రూ.50 వేసి బోన్లు తయారు చేయించినా కొన్ని పడుతున్నాయి..కొన్ని బెదిరి పారిపోతున్నాయి. యూట్యూబ్ లో చూసి తను ఇలా చింపాంజి అవతారం ఎత్తి కోతుల్ని తరిమేసేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నట్లు వివరించారు. గ్రామ ప్రజలు, ఉపర్సంచి, అధికారులు సహకారంతో తనీ చర్యకు పూనుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నివారణకు పూనుకోవాలని కొత్త సర్పంచి డిమాండ్ చేస్తున్నారు.
గ్రామాలలో కోతుల నివారణకు గతంలో తాత్కాలికంగా డప్పులు కొట్టినా, టపాసులు కాల్చినా, కొండముచ్చులతో భయపెట్టినా అవి ఏమాత్రం అదరడం లేదు బెదరడం లేదు. అటవీ ప్రాంతాల్లో జనావాసాలు పెరిగిపోతుండటంతో ...అడవుల్లో స్వేచ్చగా తిరగాల్సిన జంతువులు ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. పల్లెల్లో పంటలు దెబ్బతిం టున్నాయి...ఇళ్ళపైకి చేరి కోతులు నానా రచ్చ చేస్తున్నాయి. కొన్నూళ్ళలో అయితే రాత్రివేళలో కూడా వీటి హడావుడి తగ్గడం లేదు. నల్లగొండ జిల్లాలోని కొన్ని పల్లెల్లో ప్రజలు ఈ కోతుల నుంచి తప్పించుకోవడం చేతకాక వాటితో కలిసి బతకడం అలవాటు చేసేసుకున్నారు. అవీ మనుషుల లెక్క తిరగాడుతుంటాయి. అందుకే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల ప్రజలు కోతుల సమస్యను పరిష్కరిస్తాం అంటే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలవడం ప్రధానం కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఉదారంగా కోతుల్ని తరిమేస్తామని...పల్లెల్లో వాటి జాడ లేకుండా చేస్తామని హామీలు ఎడాపెడా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుకోవలసిన అవసరం వచ్చింది.
సరదా మాట అటుంచితే.. కొత్త సర్పంచులు పల్లెల్లో కోతుల్ని తరిమే పనిలో పడ్డారన్న వార్తను సర్కారు కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఈ తీవ్ర సమస్యతో పల్లెప్రజలు ఎంతగా బాధపడుతుంటారో...అది అనుభవించేవారికే తెలుస్తుంది. వారికి దైనందిన జీవితంలో కోతుల్నుంచి రక్షించుకోవడమే ప్రధాన వ్యాపకంగా మారిపోతుంటుంది. మరి సర్కారు కోతుల బెడద తీవ్రంగా ఉన్న పల్లెల్ని...ప్రాంతాల్ని గుర్తించి కోతులు పట్టేవారితో పట్టించి వాటిని అడవుల్లో వదలాల్సిన అవసరం ఉంది.
