ఎమ్మెల్సీ : కాంగ్రెస్ ప్రయోగం విఫలమా ? విజయమా ?
నల్లగొండ పట్టభద్రుల స్థానం నుండి బీఆర్ఎస్ తరపున గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మీద పోటీ చేసి ఓడిపోయిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు ఖాయం అయినట్లేనని తెలుస్తుంది.
By: Tupaki Political Desk | 1 Oct 2026 2:02 PM ISTతెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ మరియు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి రెండు పట్టభద్రల నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు కూతురు వాణీదేవి ప్రతినిధిగా ఉన్న మహబూబ్ నగర్ స్థానం, చింతపండు నవీన్ కుమార్ ఆలియాస్ తీన్మార్ మల్లన్న ప్రతినిధిగా ఉన్న నల్లగొండ స్థానం ఖాళీ కాబోతున్నది.
ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో శాసనసభ్యుడుగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో నల్లగొండ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిచాడు. వచ్చే ఏడాది మార్చితో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అక్కడ ఎన్నికల హడావిడి మొదలయింది.
ఈ మేరకు ఎన్నికల కమీషన్ గత 28 నుండి నవంబర్ 6 ంరకు ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించింది. డ్రాఫ్ట్ రోల్స్ నవంబర్ 25న, ఫైనల్ రోల్ డిసెంబరు 30న విడుదల చేయనున్నారు. అయితే మిగతా పార్టీలకన్నా ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించారు. బీటెక్ తో పాటు ఎల్ఎల్ బీ చదివిన సామ రామ్మోహన్ రెడ్డి మొన్నటి వరకు టీపీసీసీ మీడియా మరియు కమ్యూనికేషన్స్ చైర్మన్, అధికార ప్రతినిదిగా వ్యవహరించాడు.
మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు అయిన సర్వోత్తమ్ రెడ్డి ఓయూలో ఇంజనీరింగ్ చేసి, అమెరికాలో ఎంబీఎ చదివాడు. కాంగ్రెస్ తరపున తుంగతుర్తి, సూర్యాపేట శాసనసభ స్థానాల నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి కుమారుడిగా గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.
నల్లగొండ స్థానంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టి ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నాడు. 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం అని ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించడం చర్చానీయాంశంగా మారింది.
ఉన్న రెండు స్థానాలను రెడ్లకు ఇవ్వడం మూలంగా బీసీ సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయి ? అన్న ఉత్కంఠ నెలకొన్నది. అయితే మిగిలిన పార్టీల నుండి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా సామాజిక వర్గాల నుండి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుపును భుజాన వేసుకుని పనిచేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నల్లగొండ పట్టభద్రుల స్థానం నుండి బీఆర్ఎస్ తరపున గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మీద పోటీ చేసి ఓడిపోయిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు ఖాయం అయినట్లేనని తెలుస్తుంది. బిట్స్ పిలానీలో చదివిన రాకేష్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ఆయన క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉన్నాడు. వివిధ రకాల కార్యక్రమాలతో పట్టభద్రులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాడు.
మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుండి బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్, మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, నాగేందర్ గౌడ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పేరుతో పాటు పీవీ నరసింహరావు మనవడు ఎన్ వీ సుభాష్, గంగాపురం వెంకట్ రెడ్డిల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
గత 2021 పట్టభద్రుల ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంలో 5.18 లక్షలు, నల్గొండ స్థానంలో 5.06 లక్షల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో 3.37 లక్షల ఓట్లు, నల్గొండలో 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు పాత వారితో పాటు కొత్తగా డిగ్రీ, దానికి సమానమైన కోర్సులు పాసయిన ప్రతి ఒక్క పట్టభద్రుడు తిరిగి ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రతి స్థానంలో ఏడు లక్షల ఓట్లు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థుల ప్రయోగం ఏమవుతుందో తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచిచూడక తప్పదు.
