Begin typing your search above and press return to search.

'ఆరు' స్థానాల్లో అభ్యర్థులు ఎవరు ?

గవర్నర్ కోటాలో ఉన్న నాలుగు శాసనమండలి స్థానాలు, పట్టభద్రుల కోటాలో ఉన్న రెండు స్థానాలు వరంగల్-నల్గొండ- ఖమ్మం మరియు మహబూబ్ నగర్- హైదరాబాద్- రంగారెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి

By:  Garuda Media   |   5 Sept 2026 1:00 PM IST
ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు ?
X

తెలంగాణలో త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గవర్నర్ కోటాలో ఉన్న నాలుగు శాసనమండలి స్థానాలు, పట్టభద్రుల కోటాలో ఉన్న రెండు స్థానాలు వరంగల్-నల్గొండ- ఖమ్మం మరియు మహబూబ్ నగర్- హైదరాబాద్- రంగారెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు.

నవంబరు 14తో గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ కాలం ముగియనుంది. డిసెంబర్ 13తో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పదవీకాలం ముగుస్తుంది. అటు పట్టభద్రుల స్థానంలో సురభి వాణీదేవి, చింతపండు నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లన్న ల పదవీ కాలం ముగుస్తుంది. దీంతో అటు గవర్నర్ కోటా, ఇటు పట్టభద్రుల స్థానాల నుండి అవకాశం కోసం పోటీ నెలకొంది.

వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి అవకాశం కోసం కాంగ్రెస్ నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, స్టేషన్ ఘనపూర్ నుండి పోటీ చేసిన ఇందిర తదితరులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ తరపున తీన్మార్ మల్లన్న మీద పోటీ చేసి ఓడిపోయిన ఏనుగుల రాకేష్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆయన వివిధ కార్యక్రమాలతో మూడు జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే స్థానం నుంచి దివ్యాంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, టీ షాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, శాప్ మాజీ చైర్మన్ శివసేనారెడ్డిలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావులు పోటీ పడుతుండగా, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని అన్వేషిస్తుంది.

గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో అవకాశం కోసం కాంగ్రెస్ నుండి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మరోసారి అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నాడు. ఇక కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సతీష్, సమాచార శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.