Begin typing your search above and press return to search.

బీజేపీ చీఫ్ బరిలోకి దిగుతారా ?!

2025లో ఉత్తర్ తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల సీట్లలో గెలిచిన బీజేపీ కరీంనగర్ కార్పోరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.

By:  Garuda Media   |   5 Sept 2026 10:04 AM IST
బీజేపీ చీఫ్ బరిలోకి దిగుతారా ?!
X

తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే 2027 మార్చితో ముగియనుంది. తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్, సురభి వాణీదేవిలు అక్కడి నుండి తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బరిలోకి దిగక తప్పదా అన్న చర్చ జరుగుతోంది.

2015లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎన్. రామచందర్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాదరావుపై 13,318 ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో ఆయన 53,881 ఓట్లు సాధించాడు. దేవీ ప్రసాద్ రావుకు 40,563 ఓట్లు వచ్చాయి.

2021 నుండి అదే సిట్టింగ్ స్థానం నుండి పోటీ చేసిన ఎన్. రామచందర్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి చేతిలో 11,703 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత అనుభవం నేపథ్యంలో ఈ సారి ఈ స్థానం నుండి ఎన్. రామచందర్ రావునే బరిలోకి దించడం సముచితం అని బీజేపీ భావిస్తుంది.

2023 శాసనసభ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ గెలిచింది. 2025లో ఉత్తర్ తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల సీట్లలో గెలిచిన బీజేపీ కరీంనగర్ కార్పోరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టభద్రులలో బీజేపీకి మద్దతు పెరిగిందని భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాకుండా, మాజీ ఎమ్మెల్సీ కావడంతో ఆయనను బరిలోకి దింపితే పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని భావిస్తున్నారు.

2028లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం అంటున్న బీజేపీకి వచ్చే మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు కీలకం అని చెప్పాలి. ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని 56 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రభావం చూపింది. అది తాత్కాలికం కాదు బీజేపీ బలానికి సూచిక అని నిరూపించాలంటే బీజేపీకి ఇక్కడ గెలుపు ముఖ్యం. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం అని ఎన్. రామచందర్ రావు చెబుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.