నిజం.. మూడుసార్లు ఎమ్మెల్యే.. ఆ తర్వాత సర్పంచ్
హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని, రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే సూర్యపేటలో కావడం గమనార్హం. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరంటే..?
By: Tupaki Political Desk | 29 Nov 2025 8:00 PM ISTఈ రోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితే, వారి టార్గెట్ మంత్రి పదవి పొందడమే.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యం..! లేదా ఎంపీ అయితే, కేంద్ర మంత్రి పదవి పొందడమే గోల్..! ముఖ్యమంత్రిగా చేసినవారు కేంద్ర మంత్రులు అయ్యారు కానీ... అసలు సీఎంగా చేసినవారు మంత్రిగా పనిచేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో లేదు.. ఇదీ రాజకీయ పరమపద సోపాన పటం. ఒక్కసారి ఒక పదవి తీసుకుని అడుగు ముందుకేస్తే మళ్లీ వెనక్కు రావొద్దు అన్నది నాయకుల విధానంగా ఉంటుంది..! కానీ, ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఒకటికి మూడుసార్లు ఎన్నికై.. ఆపై సర్పంచిగా చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యే అంటే.. దాదాపు సీఎం అయ్యేంత అర్హత. కానీ, ఆయన ఎలాంటి భేషజం లేకుండా గ్రామస్థాయి పదవి అయిన సర్పంచి గిరీని ఇష్టంగా స్వీకరించారు. ఇదంతా ఎక్కడో మారుమూల నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి అనుకుంటే పొరపాటే.. హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని, రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే సూర్యపేటలో కావడం గమనార్హం. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరంటే..?
సిరికొండ ఉప్పల మల్సూర్...
ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హంగామా నడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో (కోర్టు కేసులు లేని) మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కు నామినేషన్ల దాఖలుకు శనివారంతో గడువు ముగిసింది. ఆదివారం పరిశీలన, డిసెంబరు 3న ఉపసంహరణ ఉంటుంది. ఇదే సమయంలో ఒక ఎమ్మెల్యే సర్పంచి గురించి చెప్పుకోవాలి. ఆయనే ఉప్పల మల్సూర్. ఒకప్పటి ఉమ్మడి నల్లగొండ ప్రస్తుత సూర్యపేట జిల్లా సిరికొండకు చెందిన మల్సూర్ హైదరాబాద్ స్టేట్, ఉమ్మడి ఏపీలో సూర్యపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన ఏకగ్రీవంగా తమ సిరికొండ గ్రామానికి సర్పంచి అయ్యారు. గ్రామస్థుల కోరిక మేరకు మల్సూర్ ఎలాంటి భేషజం లేకుండా ఈ పదవి చేపట్టారు.
1952లో మొదలు..
హైదరాబాద్ స్టేట్ కొనసాగిన సమయంలో మల్సూర్ 1952లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1956 వరకు కొనసాగారు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఆయన గెలిచారు. మధ్యలో 1957-62 సమయంలో ఓడిపోయారు. 1962-72 వరకు పదేళ్లు సర్పంచ్ గా కొనసాగారు. చివరి రెండు సార్లు సీపీఐ తరఫున అసెంబ్లీకి వెళ్లారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు లేదు. అనంతరమే తమ సిరికొండ గ్రామానికి సర్పంచిగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.
