Begin typing your search above and press return to search.

దానం నాగేందర్‌కు షాకిచ్చిన స్పీకర్.. ఏం జరుగనుంది?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అలుపెరగకుండా పోరాడుతోంది గులాబీపార్టీ. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మరీ వారి అనర్హత కోసం ఆరాటపడుతోంది

By:  A.N.Kumar   |   28 Jan 2026 6:42 PM IST
దానం నాగేందర్‌కు షాకిచ్చిన స్పీకర్.. ఏం జరుగనుంది?
X

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అలుపెరగకుండా పోరాడుతోంది గులాబీపార్టీ. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మరీ వారి అనర్హత కోసం ఆరాటపడుతోంది. సుప్రీంకోర్టులో సైతం సానుకూలత రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైంది. స్పీకర్ కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేయడంతో దానంకు నోటీసులు అందాయి. మరి ఈ విషయంలో ఏం జరుగునుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగం పెంచారు. అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ‌కు తాజాగా నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని దానం నాగేందర్‌ను ఆదేశించారు. అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఉదయం 10:30 గంటలకు విచారణ జరగనుండగా మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ నిర్వహించనున్నారు.

సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పీకర్‌పై ఒత్తిడి

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని భావించిన సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడంతో పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల కేసులపై స్పీకర్ దృష్టి సారించారు. వీరిలో దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ ఉన్నారు. ఇప్పటికే అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ ‘క్లీన్ చిట్’ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు.

దానం కేసు ఎందుకు భిన్నం?

మిగిలిన కేసులతో పోలిస్తే దానం నాగేందర్ వ్యవహారం భిన్నంగా కనిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది స్పష్టమైన పార్టీ ఫిరాయింపుగా పరిగణించవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు స్పీకర్ తుది నిర్ణయం తీసుకునేలోపే దానం స్వయంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

30వ తేదీకి పెరిగిన ఉత్కంఠ

మొత్తానికి ఈ నెల 30న జరగనున్న విచారణ తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. స్పీకర్ తీసుకునే నిర్ణయం కేవలం దానం నాగేందర్ భవితవ్యానికే కాకుండా, పార్టీ ఫిరాయింపులపై భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో రోజురోజుకూ పెరుగుతోంది.