Begin typing your search above and press return to search.

పొన్నం vs అడ్లూరి... తెలంగాణ మంత్రుల మ‌ధ్య మాట‌ల మంట‌లు..అస‌లు ఏం జ‌రిగింది...??

పొన్నంను ఉద్దేశించి అడ్లూరి మాట్లాడిన వీడియో బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. అందులో తనకు మంత్రి పదవి రావడాన్ని పొన్నంతో పాటు మ‌రో మంత్రి వివేక్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

By:  Tupaki Political Desk   |   7 Oct 2025 1:29 PM IST
పొన్నం vs అడ్లూరి... తెలంగాణ మంత్రుల మ‌ధ్య మాట‌ల మంట‌లు..అస‌లు ఏం జ‌రిగింది...??
X

తెలంగాణ ప్ర‌భుత్వంలోని ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య మాట‌లు మంట‌లు రేపాయి.. అదీ ఒకే ప్రాంతానికి చెందిన మంత్రుల న‌డ‌మ వివాదం రాజుకుంది... ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నుంచి ప్ర‌భుత్వంలో ఉన్న ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్.. ఎస్సీ డెవ‌ల‌ప్ మెంట్, మైనారిటీ వెల్ఫేర్ స‌హా ప‌లు బాధ్య‌త‌లు చూస్తున్న మ‌రో మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను ఉద్దేశించి చేసిన‌ట్లుగా క‌నిపిస్తున్న వ్యాఖ్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై మంత్రి పొన్నం త‌క్ష‌ణం చెప్పాల‌ని అడ్లూరి డిమాండ్ చేస్తున్నారు. అస‌లు ఈ వ్యాఖ్య ఎక్క‌డ చేశార‌న్న‌ది చూస్తే.. పొన్నం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్ ఉప ఎన్నిక బాధ్య‌త‌లు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మ‌రో మంత్రి వివేక్ తో క‌లిసి ఆయ‌న ఓ స‌మావేశంలో పాల్గొన్నారు. అప్పుడే అడ్లూరిని ఉద్దేశించి దు... అంటూ వ్యాఖ్య చేసిన‌ట్లు ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విష‌యం అధిష్ఠానం వ‌ద్ద‌కు...

తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక తొలిసారిగా ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య ర‌గ‌డ ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. కాగా, త‌న‌ను ఉద్దేశించిన‌ట్లుగా చేసిన వ్యాఖ్య‌ల‌పై పొన్నం ప్ర‌భాక‌ర్ పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాన‌ని అడ్లూరి తెలిపారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్య‌వహారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌జ‌రాజ‌న్ కి లేఖ రాశారు. పొన్నం.. బుధ‌వారం నాటికి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై పొన్నం మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిచారు. త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలుస్తాన‌ని తెలిపారు.

మాదిగ జాతిలో పుట్టి మంత్రి అవ్వడమే తప్పా?

పొన్నంను ఉద్దేశించి అడ్లూరి మాట్లాడిన వీడియో బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. అందులో తనకు మంత్రి పదవి రావడాన్ని పొన్నంతో పాటు మ‌రో మంత్రి వివేక్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. పొన్నం ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నార‌ని, తాను వేదికపైకి వ‌స్తే వివేక్ లేచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అస‌లు ఏం జ‌రిగింది...??

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను మంత్రులు పొన్నం, వివేక్, తుమ్మ‌ల‌కు అప్ప‌గించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేర‌కు పొన్నం త‌ర‌చూ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఓ స‌మావేశంలో పొన్నం, వివేక్ పాల్గొన‌గా.. ఆ స‌మ‌యంలోనే అడ్లూరిని ఉద్దేశించి పొన్నం మంత్రి వివేక్ తో సంభాష‌ణ‌లో కామెంట్ చేసిన‌ట్లు వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో మైక్ ఆన్ చేసి ఉండ‌డంతో పొన్నం ఏం మాట్లాడిన‌దీ వినిపించింది. ఇది అలా దుమారానికి దారితీసింది.