Begin typing your search above and press return to search.

ప్రభుత్వం చేతికి మెట్రో.. ఎల్ అండ్ టీ ఔట్

తాజాగా.. ఆ వాదన నిజమేనని స్పష్టం చేస్తూ.. మెట్రో సేవలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో పూర్తైంది.

By:  Garuda Media   |   26 Sept 2025 11:00 AM IST
ప్రభుత్వం చేతికి మెట్రో.. ఎల్ అండ్ టీ ఔట్
X

ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజాగా.. ఆ వాదన నిజమేనని స్పష్టం చేస్తూ.. మెట్రో సేవలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో పూర్తైంది. అయితే.. న్యాయపరమైన అంశాలు.. చట్టపరమైన రాతకోతల అనంతరం.. తెలంగాణ సర్కారు చేతికి మెట్రో రానుంది.

దీంతో.. మెట్రో విస్తరణపై ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ కావటంతో.. భవిష్యత్తులో భారీ ఎత్తున విస్తరించాలని భావిస్తున్న మెట్రోకు ఉంటే లాజిస్టిక్ సమస్యలు ఈ ఉదంతంతో తీరిపోతాయన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ మహానగరలో భారీగా మెట్రోను విస్తరించేందుకు వీలుగా రేవంత్ సర్కారు మెట్రో రెండో దశ.. మూడో దశ నిర్మాలకు సంబంధించిన ప్లానింగ్ ఇప్పటికే పూర్తైంది. తాజాగా జరిగిన డీల్ తో.. మరింత వేగంగా మెట్రో విస్తరణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఒప్పందంలో భాగంగా మెట్రో మొదటి దశ కింద ఉన్న రూ.13 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకొవటానికి అంగీకరించింది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ పర్పస్ వెహికిల్ లో ఎల్ అండ్ టీకి భాగమైన రూ.5900 కోట్ల మొత్తంలో రూ.2వేల కోట్ల వన్ టైం సెటిల్ మెంట్ కింద చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలిదశ నిర్వహణ ప్రభుత్వం చేతికి రానుంది. దీంతో రెండో దశ విస్తరణ మరింత వేగం పుంజుకునే వీలుంది.

గతంలో మెట్రో రైలు నెట్ వర్కు కు సంబంధించి దేశంలోనే రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. పదేళ్లుగా ఎలాంటి విస్తరణ లేకపోవటంతో దేశంలో హైదరాబాద్ మెట్రో తొమ్మిదో స్థానానికి దిగజారింది. విస్తరణ వేళ.. మొదటి దశతో అనుసంధానం అన్నది కీలకం. ఈ విషయంలో ఉన్న ఇబ్బందులు తాజా నిర్ణయంతో తొలిగిపోయినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో 8 మార్గాలతో 163 కి.మీ. విస్తరించేలా ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. అయితే..దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకుంటే.. రెండు దశల ప్రాజెక్టుల మధ్య సమన్వయం కోసం ఎల్ అండ్ టీతో రాష్ట్ర పరభుత్వం కలిసి పని చేసే అంశంపై పక్కా విధివిధానాల్ని సిద్ధం చేయాలని.. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎల్ అండ్ టీ సంతకం ఉండాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే రెండు దశల మెట్రోలో భాగస్వామిగా ఉండాలని ఎల్ అండ్ టీని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే.. తాము రవాణా రంగం నుంచి బయటకు వచ్చేస్తున్నామని.. ఈ నేపథ్యంలో తాము ముందుకు రాలేమని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఇదే సందర్భంగా తమ వాటాను రాష్ట్రం కానీ కేంద్రం కాని కొంటానంటే అమ్మేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో జరిగిన కీలక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఇతర ముఖ్యులతో పాటు ఎల్ అండ్ టీ సీఎండీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తాము రెండో దశలో భాగస్వామిగా ఉండలేమని ఎల్ అండ్ టీ సీఎండీ సుబ్రహ్మణ్యన్ స్పష్టం చేశారు. దీంతో రెండో దశను తాము నిర్మించుకుంటామని.. రెండు దశల మధ్య సమన్వయం కోసం డెఫినిటివ్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆదాయం.. ఖర్చులను పంచుకోవాలనే అంశాలు ఉన్నట్లు చెప్పారు.

ఆదాయం పెరగకపోవటం.. నిర్వహణ భారం పెరిగిన ఆందోళనలో తాము ఉన్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము రెండో దశలో ప్రభుత్వంతో కలిసి నడిచే ఒప్పందంపై సంతకం చేయలేమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుకు సంబంధించిన తమ 90 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో.. తొలి దశ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.

ఈ సందర్భంగా కుదిరిన డీల్ లో రూ.13 వేల కోట్ల అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని.. తమ వాటా కింద రూ.5900కోట్లు చెల్లించాలని ఎల్ అండ్ టీ కోరింది. గత ప్రభుత్వ హయాంలో 2022 జులై 22న కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు చెల్లించాలని.. అందులో ఇంకా రూ.2100 కోట్లు ఎల్ అండ్ టీకి అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

తొలిదశ ప్రాజెక్టు అప్పు రూ.13 వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదే సమయంలో ఎల్ అండ్ టీకి ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో రూ.2వేల కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మెట్రో నిర్వహణ చేపట్టిన ఎల్ అండ్ టీకి అప్పగించిన 260 ఎకరాల భూమిని.. ప్రభుత్వానికి తిరిగి వచ్చేయనుంది. దీంతో. .ఈ భూముల అమ్మకాలతో మెట్రో తొలి దశకు ఉన్న రూ.13వేల కోట్లు అప్పు ప్రభుత్వానికి పెద్ద భారం కాబోదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. మెట్రో మొదటి దశ.. తర్వాతి దశల నిర్వహణ బాధ్యతలను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నిర్వహిస్తుందా? లేదంటే మరేదైనా సంస్థతో ఒప్పందం చేసుకోనుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.