Begin typing your search above and press return to search.

మందు తాగడంతో దేశంలో తెలంగాణోళ్లే టాప్.. అట్లుంటదీ మరి మనోళ్లతోని..

నగరాల్లోనే పబ్‌లు, బార్ల గోల ఎక్కువనుకుంటే పొరపాటే. అసలైన "సిట్టింగ్" కిక్కు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందట.

By:  A.N.Kumar   |   4 Oct 2026 6:00 PM IST
మందు తాగడంతో దేశంలో తెలంగాణోళ్లే టాప్.. అట్లుంటదీ మరి మనోళ్లతోని..
X

మందు తాగడంలో.. బాటిల్ ఎత్తడంలో తెలంగాణోళ్లను కొట్టేటోడే లేడని మరోసారి నిరూపితమైంది. "అట్లుంటది మరి మనోళ్లతోని" అంటూ కాలర్ ఎగరేసేలా మన మందుబాబులు ఏకంగా జాతీయ రికార్డులను బద్దలు కొట్టేశారు. ఏ ప్రతిష్టాత్మక అవార్డుల్లోనో.. పతకాల పట్టికలోనో అనుకుంటే పొరపాటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్ఎస్-6) వెల్లడించిన మద్యపాన గణాంకాల జాబితాలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఏకంగా 43.9 శాతం మంది రెగ్యులర్‌గా మద్యం సేవిస్తూ "మేము సైతం" అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే వయసున్న పురుషుల సగటు మద్యం వినియోగం కేవలం 18.9 శాతమే ఉంటే.. మనోళ్లు మాత్రం దానికి రెండింతలకు పైగా స్కోర్ చేసి జాతీయ సగటుని తేలిగ్గా దాటేశారు. మద్యం ప్రియుల పోటీలో 42.2 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా ఛత్తీస్‌గఢ్ (38.3%), జార్ఖండ్ (33.6%), మధ్యప్రదేశ్ (26.9%) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పట్టణాల కన్నా పల్లెటూర్లలోనే ‘కిక్కు’ ఎక్కువ!

నగరాల్లోనే పబ్‌లు, బార్ల గోల ఎక్కువనుకుంటే పొరపాటే. అసలైన "సిట్టింగ్" కిక్కు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందట. పట్టణాల్లో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం 36.3 శాతంగా ఉంటే.. పల్లెల్లో అది ఏకంగా 46.6 శాతానికి చేరుకుంది. అంటే నగరాల కంటే పల్లెటూర్లలోనే మరో 10 శాతం మంది ఎక్కువగా మద్యం తుఫానులో మునిగితేలుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, కాలేయాన్ని ఎంత గట్టిగా కాపాడుకోవాలో ఈ రికార్డులు చూస్తేనే అర్థమవుతోంది.

మహిళల్లోనూ రెండవ స్థానం..

ఇక ఈ విభాగంలోనూ మేము తక్కువ తినలేదన్నట్లుగా మహిళల కేటగిరీలోనూ తెలంగాణ 7.1 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 19.9 శాతంతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంటే ఛత్తీస్‌గఢ్ (5.7%), జార్ఖండ్ (5.5%) మన వెనుకే ఉన్నాయి.

మొత్తానికి వినోదం, సంబరాలు, చిన్నపాటి దావత్‌లను కూడా గ్లాస్ లేకుండా పూర్తి చేయలేకపోవడం మన స్థానిక సంస్కృతిలో భాగమైపోయిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయితే కాలర్ ఎగరేసుకునే ఈ రికార్డు వెనుక కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఛిద్రమవ్వడం, ఆరోగ్యం గుల్లకావడం లాంటి చేదు నిజాలు దాగి ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు జాగరూకతతో విచక్షణారహిత అమ్మకాలపై, ఆరోగ్యంపై దృష్టి సారించకపోతే.. ఈ 'కిక్కు' చివరికి పెద్ద దెబ్బే తీసేలా ఉంది.