అత్యాచార కేసులో 35 ఏళ్ల శిక్ష : అమెరికా జైల్లో తెలుగు యువకుడి ఆత్మహత్య
అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన యువకుడు కుర్రెముల సాయికుమార్ (31) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By: A.N.Kumar | 3 Aug 2025 5:51 PM ISTఅమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన యువకుడు కుర్రెముల సాయికుమార్ (31) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక నేరాల కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష పడిన తర్వాత సాయికుమార్ జూలై 26న జైలులో ఉరి వేసుకుని చనిపోయాడు. జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన సాయికుమార్ దాదాపు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు.
సాయికుమార్ ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. అక్కడ అతను 15 ఏళ్ల బాలుడిగా నటించి ముగ్గురు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు, ఇంకా 19 మంది బాలికలను అసభ్యకర చిత్రాలతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో, ఎఫ్‌బీఐ రంగంలోకి దిగి 2023 అక్టోబరులో సాయికుమార్‌ను అరెస్ట్ చేసింది.
విచారణలో సాయికుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో, 2025 మార్చి 27న అమెరికా కోర్టు అతడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తర్వాత మానసికంగా కుంగిపోయిన సాయికుమార్ జూలై 26న జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల విషాదం ఈ విషయం తెలుసుకున్న సాయికుమార్ తల్లిదండ్రులు ఉప్పలయ్య, శోభ అమెరికా వెళ్లారు. అక్కడే అతని అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటన తెలుగు యువతకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఆన్‌లైన్ ప్రపంచంలో అడ్డగోలుగా చేసే పనులు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో ఈ విషాదం స్పష్టం చేస్తోంది.
