తులం బంగారం ఇవ్వలేం.. కష్టం.. మహిళలకు షాకిచ్చిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ నిలబడలేదు.
By: A.N.Kumar | 3 Nov 2025 5:34 PM ISTతెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ నిలబడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద కొత్తగా పెళ్లయిన మహిళలకు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.
ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ "ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. హామీ ఇచ్చిన సమయంలో తులం బంగారం ధర దాదాపు రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది దాదాపు రూ.1.5 లక్షలకు చేరింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆ భారాన్ని భరించడం అసాధ్యం" అని స్పష్టంగా తెలిపారు.
*నిరాశలో మహిళలు.. విమర్శిస్తున్న ప్రతిపక్షం
ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికల సమయంలో ఈ హామీపై పూర్తి విశ్వాసం ఉంచిన లబ్ధిదారులు ఇప్పుడు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు 'కళ్యాణ లక్ష్మి' పథకం కింద బంగారం అందించడం జరగలేదు. ప్రస్తుతం కేవలం లక్ష రూపాయల చెక్కును మాత్రమే లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ఇదే అంశంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తీవ్రంగా మండిపడింది. "కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బంగారం ధరల పేరుతో మాట మార్చుకుంటోంది" అని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
*రాజకీయంగా ప్రతికూల ప్రభావం?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ పరంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు వస్తున్న వేళ, తులం బంగారం రద్దు అంశం మరింత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఈ వివాదం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన చర్చాంశంగా మారవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సంక్షేమ పథకాల భారంతో కష్టాల్లో ఉంది. ఉచిత ప్రయాణాలు, పెరిగిన పింఛన్లు, గ్యాస్ సబ్సిడీలు, బియ్యం పంపిణీ వంటి పథకాలు ప్రభుత్వానికి భారీ వ్యయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులు సైతం ఆర్థికాభావంతో నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మొత్తం మీద తులం బంగారం హామీ రద్దుతో కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని ప్రతిపక్షం తీవ్రంగా ప్రచారం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం "వాస్తవ పరిస్థితులు మారిపోయాయి" అంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఈ వివాదం మరికొన్ని రోజులు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే అవకాశముంది.
