ఫ్రీ కటింగ్...ఫ్రీ షేవింగ్....ఎన్నికల హామీ అదిరిపోలా !
కాదేదీ ఎన్నికల హామీలకు అనర్హం అన్నది రాజకీయ జీవుల మాట. ఎన్నికలు వస్తే ఎన్నో సిత్రాలు కనిపిస్తాయి. తమాషాలు చోటు చేసుకుంటాయి.
By: Satya P | 4 Dec 2025 11:37 PM ISTకాదేదీ ఎన్నికల హామీలకు అనర్హం అన్నది రాజకీయ జీవుల మాట. ఎన్నికలు వస్తే ఎన్నో సిత్రాలు కనిపిస్తాయి. తమాషాలు చోటు చేసుకుంటాయి. ఆకాశం దించుతామని చంద్రమామని తెచ్చి చేతికి ఇస్తామని ఇలా రకరకాలైన హామీలు ఇస్తూ పోతుంటారు. ఇక స్థానిక ఎన్నికల్లో చూస్తే మరిన్ని హామీలు ముచ్చట పెడుతూంటాయి. పల్లెల్లో ఉండే పరిస్థితులు జనాల మనస్తత్వాలు అన్నీ కూడా కలగలుపుకుని ఇచ్చే హామీలు భలే తమాషాగా ఉంటాయి.
ఉచితంగా కత్తెర :
పల్లెల్లో చూస్తే కనుక సెలూన్ దుకాణాలకు మంచి గిరాకీయే ఉంటుంది. అరువుకు కూడా క్షవరం చేసి పెడుతూంటారు. అందరూ ఒకే దగ్గర ఉండేవారు, తెలిసిన వారుగా కనిపిస్తారు. ఇపుడు అరువూ లేదు, అప్పూ లేదు ఏకంగా ఫ్రీ అంటున్నాడొక మహిళా అభ్యర్థి భర్త. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఒక వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్ధి భర్త చిత్రమైన హామీని ఇచ్చారు తన భార్యను వార్డు మెంబర్ గా గెలిపించండి మహా ప్రభో. దానికి బదులుగా వార్డు పరిధిలో పురుషులు అందరికీ ఏకంగా అయిదేళ్ల పాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తాను అని భారీ హామీ ఇచ్చేశారు.
ఆల్ ఫ్రీ అంటే :
ఇది ఆల్ ఫ్రీ హామీగా ఉందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ వింత అయిన హామీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. దాంతో ఒక విధంగా వైరల్ అయింది. ఒక వార్డు మెంబర్ గా తన భార్య గెలిస్తే అయిదేళ్ళ పాటు కటింగ్ ఫ్రీ అంటే ఇక ఉపాధి మొత్తం వార్డుకే ధారపోస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అలా అయితే ఆదాయం ఎలా వస్తుంది అన్నది కూడా చర్చిస్తున్నారు. అయితే వార్డు మెంబర్ గా తన భార్య నెగ్గితే చాలు అన్న పంతం పట్టుదల ఆయనలో ఎంతగా కనిపిస్తోందో అన్న మాట కూడా ఉంది.
జనాలు పడతారా :
ఆకర్షణీయమైన హామీలకు జనాలు పడతారని అంటారు. మరి ఇది కూడా అలాంటి హామీగానే ఉంది. దీనికి జనాలు పడతారా అంటే ఆలోచించాల్సిందే. మరీ అంతా ఫ్రీ అంటే జనాలు కూడా లైట్ తీసుకుంటారేమో అని అంటున్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలు ఎన్ని నిజం అవుతాయన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి హామీలు ఇలా కూడా ఇవ్వవచ్చునా అన్న కొత్త చర్చకు ఈ మహిళా అభ్యర్థి భర్త అయితే తెర లేపాడు. ఇవన్నీ పక్కన పెడితే తలమాసిన రాజకీయ నేతలు ఎంతో మంది ఉన్నారు, వారి ఇచ్చే హామీల కంటే ఈ సెలూన్ యజమాని ఇచ్చే హామీ ఎంతో సబబుగానే ఉందని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఎన్నికలలో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో అన్నది కూడా ఉంది.
