Begin typing your search above and press return to search.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ.. కారణం ఇదేనా..!

By:  Raja Ch   |   11 Jan 2026 6:00 AM IST
తెలంగాణ మున్సిపల్  ఎన్నికల్లో జనసేన పోటీ.. కారణం ఇదేనా..!
X

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక పూర్తైన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎన్నికలు అత్యంత రసవత్తరంగా సాగాయి. ఫలితాలు దాదాపుగా ఊహించినట్లుగానే వచ్చాయనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో తెలంగాణలో మరో ఎన్నికల సందడి మరికొన్ని రోజుల్లో మొదలవ్వబోతుందని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. దీంతో.. ఇది చర్చనీయాంశంగా మారింది.

అవును... ఏపీలో అధికారంలో ఉన్న జనసేన.. తెలంగాణలోనూ తన మార్కు చూపించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేయబోతుందనే చర్చ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని.. ఈ దిశగా కసరత్తు జరుగుతోందని అంటున్న వేళ.. ఇందులో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్, బీఆరెస్స్, బీజేపీలో సై అంటున్న వేళ.. సై సై అంటూ జనసేన అప్ డేట్ ఇచ్చింది.

ఇందులో భాగంగా... రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు.. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించినట్లు ఆ పార్టీ తాజాగా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొంది.

ఇదే సమయంలో.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలు ఈ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిస్తున్నట్లు జనసేన తెలిపింది. దీంతో.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన.. బీజేపీ, టీడీపీలను కలుపుకునే ముందుకు వెళ్తుందా.. లేక, కేవల బీజేపీతోనే కదులుతుందా.. అదీగాక, ఒంటరిగానే సత్తా చాటాలని భావిస్తుందా అనేది తెలియాల్సి ఉంది!

కాగా.. ఏపీలో 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఉత్సాహంలో జనసేన ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పలు శాఖల నిర్వహణలో పవన్ కల్యాణ్ చూపిస్తున్న పెర్ఫార్మెన్స్ విషయంలో తెలంగాణ ప్రజానికం దృష్టిలోనూ ఆయనకు మంచి మార్కులు పడ్డాయని.. ఈ నేపథ్యంలోనే ఈ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు!

మరోవైపు ఈ నెల 17న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో 21 లేదా 22 తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసి.. ఫిబ్రవరి 20లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని అంటున్నారు. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్‌ కార్పోరేషన్లు కలుపుకుని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది!