సుప్రీంకోర్టుకు 'స్థానిక సమరం': ఏం తేలుతుంది?
ఏకమొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుబట్టారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు లకు, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విఘాతమని వాదనలు వినిపించారు.
By: Garuda Media | 11 Oct 2025 3:55 PM ISTతెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం కొనసాగుతూనేఉంది. గత ఏడాది జనవరిలోనే స్థానిక సంస్థలై న ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు గడువు తీరింది. తర్వాత.. వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించాలి. అయితే.. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉచితాల అమలు ద్వారా ప్రజల్లో సానుకూలత పోగేసుకుని అప్పుడు ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించుకుంది. దీంతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు హైకోర్టు జోక్యంతో సెప్టెంబరు 30 తర్వాత నిర్వహించాల్సి ఉంది.
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన దరిమిలా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్‌ను కూడా.. స్థానిక ఎన్నికల నుంచే చేపట్టాలని భావించారు. అయితే.. ఈ రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఇప్పటి వరకు అటు గవర్నర్ కానీ, ఇటు రాష్ట్రపతి కానీ.. ఆమోదించ లేదు. ఈ క్రమంలో మధ్యేమార్గంగా జీవోను తీసుకువచ్చారు. ఇది అమలు చేయాలని నిర్ణయించారు. కానీ, మల్కాజిగిరికి చెందిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఏకమొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుబట్టారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు లకు, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విఘాతమని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు.. అసలు ఎన్ని కలు వద్దు.. రిజర్వేషన్ వద్దు..అ న్నట్టుగా అన్నింటిపైనా స్టే విధించింది. కానీ, వాస్తవానికి అక్టోబరు 9 నుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
అయితే.. తాజాగా హైకోర్టు మొత్తం ప్రక్రియపై స్టే విధించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న గత తీర్పులను ఉటంకించడంతోపాటు.. ప్రస్తుతం ఎలానూ నోటిఫికేషన్ ఇచ్చేసిన దరిమిలా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని.. కోరనుంది.
ఇక, రిజర్వేషన్‌కు సంబంధించిన జీవో 9ని కూడా అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించనుంది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. సహజంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల వరకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
