Begin typing your search above and press return to search.

ఆ విధంగా ఎన్నికలు నిర్వహించవచ్చు.. ప్రభుత్వానికి సూచించిన హై కోర్టు..

ఎన్నికల ప్రక్రియను ఆపాలనే ఉద్దేశం తనకు లేదని. రాజ్యాంగంలోని అధికరణ 243-ఓ ప్రకారం ఎన్నికల ప్రకటనలో న్యాయస్థానానికి జోక్యం చేసే అధికారం లేదని పేర్కొంది.

By:  Tupaki Political Desk   |   11 Oct 2025 3:00 PM IST
ఆ విధంగా ఎన్నికలు నిర్వహించవచ్చు.. ప్రభుత్వానికి సూచించిన హై కోర్టు..
X

తెలంగాణ రాజకీయ వాతావరణంలో మళ్లీ ‘స్థానిక’ ఎన్నికల వేడి రాజుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో, ఈ ఎన్నికలు చట్టపరమైన స్పష్టత దశకు చేరుకున్నాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ, హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించినా, అదే సమయంలో ఎన్నికల సంఘానికి స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఇచ్చింది గడువు ముగిసిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది.

చట్ట పరిమితి స్పష్టత

హైకోర్టు ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లు ఏవైనా 50 శాతానికి మించద్దని సుప్రీం కోర్టు ‘కిషన్‌రావు కబాలి కేసు’ విషయంలో స్పష్టంగా పేర్కొన్నదని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మొత్తం 67 శాతం దాటిందని కోర్టు తెలిపింది. జీవో 9కు ముందు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 25% మొత్తం 50% రిజర్వేషన్లు ఉండేవని, కొత్త జీవో ద్వారా పెంపు రాజ్యాంగ పరిమితిని అతిక్రమించిందని స్పష్టం చేసింది.

వెనుకబడిన వర్గాల హక్కు

రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలో, బీసీ రిజర్వేషన్లను పెంచడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, అది సమాజిక సమానత్వం సాధించడమే అవుతుందని పేర్కొంది. వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ణయించామని వాదించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది, 50 శాతం పరిమితి అనేది కఠినమైన నియమం కాదని, అవసరాన్ని బట్టి రాష్ట్రాలు సవరించుకునే హక్కు ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే హైకోర్టు మాత్రం, ఈ వాదనను నిరాకరించింది. ‘రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం తీర్పు’ ప్రామాణ్యాన్ని పునరుద్ఘాటించింది.

ప్రక్రియలో జోక్యం చేసుకోం..

ఎన్నికల ప్రక్రియను ఆపాలనే ఉద్దేశం తనకు లేదని. రాజ్యాంగంలోని అధికరణ 243-ఓ ప్రకారం ఎన్నికల ప్రకటనలో న్యాయస్థానానికి జోక్యం చేసే అధికారం లేదని పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలను పాత రిజర్వేషన్ విధానం ప్రకారం కొనసాగించవచ్చని ఎన్నికల సంఘానికి సూచించింది. అంటే, ఎన్నికల నిర్వహణకు ఎటువంటి చట్టపరమైన ఆటంకం లేదని హైకోర్టు స్పష్టంచేసింది.

సుప్రీం తలుపు తట్టనున్న ప్రభుత్వం

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందలేదు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల నిలుపుదలపై స్పెషల్ లీవ్ పిటీషన్ (SLP) దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, వెనుకబడిన వర్గాల న్యాయం కోసం సుప్రీంకోర్టులో తమ వాదనను బలంగా వినిపించనున్నారు. ఇక, హైకోర్టు ఆదేశాలు ఎన్నికల సంఘానికి స్పష్టతనిచ్చాయి. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగవచ్చని సూచించాయి. అంటే, హైకోర్టు తీర్పు ఒకవైపు చట్టపరమైన సమతుల్యతను, మరోవైపు ఎన్నికల నిర్వాహణకు స్పష్టమైన మార్గాన్ని చూపించింది.

ప్రజల దృష్టిలోని ఉత్కంఠ

ప్రజల దృష్టిలో ఇప్పుడు ప్రధాన ప్రశ్న తలెత్తింది. ‘ఎన్నికలు ఎప్పుడు..?’ హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగితే.. స్థానిక సంస్థల్లో బీసీ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో, బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కొనసాగుతుందని తెలుస్తోంది.

ఇక, ఈ తీర్పు రాజకీయ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం ‘వెనుకబడిన వర్గాల న్యాయం’ అంటూ చెప్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు ‘చట్టపరమైన లోపాలతో’ ప్రజా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

హైకోర్టు తీర్పు ఒక విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులు సమానత్వాన్ని కాపాడేందుకే ఉన్నాయి, రాజకీయ అవసరాలకు కాదు. ఇక ఎన్నికల సంఘం పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి వచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే, ఆ తీర్పు భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు మార్గదర్శకంగా నిలవవచ్చు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ కాదు చట్టం, సామాజిక న్యాయం, రాజ్యాంగ సమతుల్యతల మధ్య జరుగుతున్న పరీక్ష. ఈ పరీక్షలో విజయం సాధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టడమే.