Begin typing your search above and press return to search.

తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. రాజకీయ నాయకుల ఆశలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను అనౌన్స్ చేశారు. ఐదు దశల్లో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.

By:  Tupaki Political Desk   |   29 Sept 2025 3:18 PM IST
తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. రాజకీయ నాయకుల ఆశలు
X

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. సర్పంచుల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కావస్తుంది. అయితే పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో గ్రామాల్లో అధికారుల పాలన వద్దని, మరికొన్ని రోజులు పాలన తమకే అప్పగించాలని కొందరు సర్పంచులు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు వారి వినతిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అధికారుల పాలన పెట్టి కాలం పొడిగించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను అనౌన్స్ చేశారు. ఐదు దశల్లో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. నోటిఫికేషన్ అక్టోబర్ 9వ తేదీ విడుదల చేయనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ అక్టోబర్ 23, 27న జరగనుండగా, వార్డు, సర్పంచ్ స్థానాలకు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8వ తేదీ ఓటింగ్ ఉంటుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల రోజే కౌంటింగ్ జరుగుతుంది.

ప్రజల అభిప్రాయం ఇదే..

ఈ ఎన్నికలు కేవలం పదవుల పోరు మాత్రమే కాదు, గ్రామాలు, పట్టణాలు, ఊరూ, వాడా అభివృద్ధికి దిశా నిర్ధేశం చేసేదిగా భావిస్తున్నారు. తక్కువ వనరులు, అవినీతి, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఇవే స్థానిక ప్రజలను ఎక్కువ ఆందోళనలో ఉంచుతున్నాయి. ప్రతి ఓటు ప్రజాస్వామ్యంపై, పాలన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టంగా చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల దృష్టికోణం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్యలు, రోడ్లు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు వంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో కొత్త హామీలు వినిపిస్తాయి, కానీ గతంలో ఏ నాయకుడు ఇచ్చిన హామీలు నిజానికి అమలు కాలేదు. ఇప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకోవాలి అనుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ లేదా వార్డు సభ్యులు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, ప్రజల నపుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

పట్టణ ప్రాంతాల వాసులు ఏమంటున్నారంటే..

పట్టణాల్లో యువత, మధ్య తరగతి ప్రజలు సోషల్ మీడియా, అభ్యర్థుల గత చరిత్రను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థికి గత పాలన చరిత్ర ఉందా.? ఒక వేళ వారి కుటుంబ సభ్యులకు పాలన చరిత్ర ఉంటే వారు ఎంత వరకు సక్సెస్ అయ్యారన్న విషయాలను సోషల్ మీడియాలో వెతికి మరీ ప్రచారం చేస్తామని యువత చెప్తోంది.

వ్యాపారులు సైతం ఇదే మాట..

పట్టణాల్లోని చిరు వ్యాపారులు, వాణిజ్యవేత్తలు కూడా స్థానిక పాలనపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం, స్థానిక ప్రభుత్వ పనితీరు ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, రోడ్లు, బస్సు సౌకర్యాలు, రహదారుల నిర్వహణ, వ్యాపార అనుమతులు అన్ని సమస్యలపై లోతుగా చర్చించుకుంటున్నారు.

ఎన్నికలు అంటే కేవలం ఓటు వేయడం కాదు.. ఇది గ్రామం, పట్టణం భవిష్యత్ కు ఓటు వేయడం అంటున్నారు. యువత, మహిళలు, ప్రత్యేకించి తమ సమస్యలను పరిష్కరించగల అభ్యర్థిని మాత్రమే ఎంచుకోవాలని కోరుతున్నారు. ఓటు ప్రతీ వ్యక్తికి ఒక శక్తివంతమైన సాధనం అని గుర్తించారు.