రేవంత్ మాటలు వైసీపీకి ప్రియం...హరీష్ కామెంట్స్ టీడీపీకి సుఖం
తెలంగాణా రాజకీయం కాస్తా ఏపీ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ రాజకీయ ప్రకంపనలు పుడితే ఏపీలో రీ సౌండ్ చేస్తోంది.
By: Satya P | 5 Jan 2026 9:32 AM ISTతెలంగాణా రాజకీయం కాస్తా ఏపీ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ రాజకీయ ప్రకంపనలు పుడితే ఏపీలో రీ సౌండ్ చేస్తోంది. దానికి కారణం అక్కడా ఇక్కడా అధికార ప్రతిపక్షాలు ఉప్పూ నిప్పుగా ఉండడమే. ఇక తెలంగాణాలో అధికార పక్షం కాంగ్రెస్ అయినా సీఎం రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీలో కీలక నేత పైగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు. ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర టీడీపీలోనే ఆయనకు వచ్చింది. ఆయన ఎంత కాంగ్రెస్ మనిషి అయినా ఒకనాటి తమ వారే అన్న భావన టీడీపీకి ఎక్కడో చాలానే ఉంది.
ఈ బంధం ఏనాటితో :
ఇక వైఎస్సార్ కి కేసీఆర్ కి మధ్య అయితే పెద్దగా పొత్తు మాటే లేదు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్య పొత్తులను కుదిర్చిన వారు నాటి కాంగ్రెస్ పెద్ద దిగ్విజయ్ సింగ్. ఆ తరువాత మధ్యలోనే పొత్తు పెటాకులు అయింది. ఇక 2009 నాటికి టీడీపీ టీఆర్ఎస్ మహా కూటమిగా పోటీ చేసి వైఎస్సార్ చేతిలో ఓటమి పాలు అయ్యాయి. అది డిఫరెంట్ స్టోరీ. ఇది పక్కన పెడితే వైఎస్సార్ తో కుస్తీ చేసిన కేసీఆర్ కి ఆయన కొడుకు జగన్ తో మాత్రం దోస్తీ కుదిరింది అంటారు. ఈ ఇద్దరినీ కలిపిన రాజకీయ పరిణామాలు చాలానే ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ నుంచి వచ్చి ఆదే కాంగ్రెస్ ని శతృవు గా చూశారు. అంతే కాదు రాష్ట్రం విడిపోతే ఏపీలో జగన్ వైసీపీ రైజ్ అయింది. తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా ఇద్దరికీ ఎక్కడా పొలిటికల్ క్లాష్ అన్నది లేకపోవడం కూడా స్నేహం కుదరడానికి కారణం కావచ్చు. అలాగే ఇద్దరికీ చంద్రబాబు ప్రత్యర్ధి కావడం మరో అనుకూల భావజాలంగా ఉంది. అందుకే ఇద్దరు మిత్రులు అయ్యారు అని చెబుతారు.
రేవంత్ మాటలతో ఖుషీ :
ఇదిలా ఉంటే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చంద్రబాబుని నిలదీసి ఒప్పించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపించాను అని బిగ్ సౌండ్ చేశారు. అంతే వైసీపీ కి అది ఎంతో ప్రియం అయిపోయింది. చెవులకు ఇంపుగా తోచింది. దాంతో వైసీపీ నేతలు అంతా రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాశారు అంటూ తీవ్ర విమర్శలు మొదలెట్టారు.
టీడీపీకి సుఖంగా :
కట్ చేస్తే బీఆర్ఎస్ కీలక నేత ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీడియాను ముందు పెట్టి తెలంగాణా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఆయన చెప్పీంది రేవంత్ రెడ్డికి పూర్తిగా ఉల్టాగా ఉంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధం చెప్పారని హరీష్ రావు ఆరోపించారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని జగన్ హయాంలోనే తాము ఆపించామని కూడా ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు. ఈ కామెంట్స్ తో టీడీపీ శ్రేణులు ఇది కదా అసలు మ్యాటర్ అని వైసీపీని కార్నర్ చేస్తున్నాయి. రాయలసీమకు అసలు ద్రోహం చేసింది వైసీపీనే అని రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని ఆపింది ఎవరు అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు, ఎందుకంటే వైసీపీ హయాంలో అనుమతులు లేకుండా మొదలెట్టడం వల్లనే అది ఆగిపోయింది అని టీడీపీ అంటోంది. మరి అలా ఆగిందా లేక పొరుగు రాష్ట్రం ఒత్తిళ్ల నుంచి ఆగిందా లేక ఇంకేదైనా కారణమా అన్నది మాత్రం తేలడంలేదు.
