Begin typing your search above and press return to search.

పవన్ ‘దిష్టి వ్యాఖ్యల దుమారం’.. హైదరాబాద్ ఆస్తులు అమ్మేసుకుంటారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   29 Nov 2025 7:57 PM IST
పవన్ ‘దిష్టి వ్యాఖ్యల దుమారం’.. హైదరాబాద్ ఆస్తులు అమ్మేసుకుంటారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కోనసీమ ప్రాంత కొబ్బరి రైతులతో ముఖాముఖి మాట్లాడిన పవన్.. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించారు. కోనసీమ పచ్చదనమే శాపంగా మారి రాష్ట్ర విభజనకు దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అంతేకాకుండా పవన్ కాస్త బుర్ర వాడాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిరసన తెలియజేశారు. పవన్ సొంతంగా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని, టీడీపీ, బీజేపీ మద్దతుతో ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ తెలంగాణపై వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించాలని సలహా ఇచ్చారు. సినీ నటుడిగా పవన్ కు తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారన్న విషయాన్ని మరచిపోయారా? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ సంపాదిస్తున్న పవన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడటం కరెక్టు కాదన్నారు.

పవన్ కల్యాణ్ కు ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాదులో ఉన్న తన ఆస్తులను అమ్మేసుకుని వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. చిరంజీవి సోదరుడు కాకపోతే పవన్ ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్ కు ఉందా? అంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ సినిమాలు అంటే తనకూ అభిమానమే అని.. OG సినిమా ప్లాప్ అయినా తాను రూ.800 టికెట్ తీసుకుని సినిమా చూశానని అనిరుధ్ రెడ్డి తెలిపారు. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణ చేయాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ నెల 26న పవన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొబ్బరి రైతులతో ముఖాముఖి సమావేశంలో కోనసీమ అందాలను పొగిడే క్రమంలో నవ్వుతూ తెలంగాణ నేతలు దిష్టిపెట్టారా? అని నాకు అనిపిస్తుందని అన్నారు. మాటల క్రమంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో తెలంగాణ భావోద్వేగాన్ని తట్టిలేపాలని బీఆర్ఎస్ ప్రయత్నించగా, కాంగ్రెస్ కూడా ఆ రేసులోకి దూసుకొచ్చింది. రెండుపార్టీల నేతలు పవన్ పై పోటాపోటీగా విమర్శలు చేస్తూ తెలంగాణ స్వరం తామే అని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనపై తెలంగాణ నేతల ఆగ్రహావేశాలు మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.