Begin typing your search above and press return to search.

'కొడంగ‌ల్‌' రాజ‌కీయం మామూలుగా లేదు!

ఎత్తుకు పై ఎత్తులు వేయ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్‌. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో అదే జ‌రుగుతోంది.

By:  Garuda Media   |   26 Sept 2026 7:00 PM IST
కొడంగ‌ల్‌ రాజ‌కీయం మామూలుగా లేదు!
X

ఎత్తుకు పై ఎత్తులు వేయ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్‌. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో అదే జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థి శిబిరాల‌ను కూల్చే ప‌నిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండ‌గా.. ఆయ‌న‌కు ఎస‌రు పెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు రెడీ అవుతున్నాయి. అయితే.. ఎవ‌రికి వారుగా ఈ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉమ్మ‌డి రాజ‌కీయాలకంటే.. ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో కీల‌కమైన ఓటు బ్యాంకుకు సెగ పెరుగుతోంది. బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కుల‌ను ఓడించాల‌న్న‌ది సీఎం రేవంత్ వ్యూహంగా ఉంది.

రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌హ‌జ‌మే అనుకున్నా.. ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇలానే రాజ‌కీయాలు మారుతున్నాయి. మండ‌లాలు, గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌, క‌విత పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రులు ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన రాజ‌కీయం ఉంటుంది. అధికార పార్టీ కూడా బ‌లంగానే ఉంటుంది. కొడంగ‌ల్‌లో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి.

2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన ప‌రిస్థితి తెలిసిందే. అనంత‌రం.. జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇలానే.. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌ను ఓడించ‌డం ద్వారా.. రేవంత్ దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని పార్టీలు నిర్ణ‌యించాయి. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు పెంచ‌డం గ‌మ‌నార్హం. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రులు త‌ర‌చుగాఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. అంతేకాదు.. గ్రామీణ కొడంగ‌ల్ ప్రాంత స‌మ‌స్య‌లు లేవ‌నెత్తుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి పార్టీ పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది.

అలాగే.. బీజేపీ నాయ‌కులు ర్యాలీల రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. పార్టీ ప‌రంగా బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంద‌ని భావిస్తున్న క‌మ‌ల నాథులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేస్తామ‌ని చెబుతున్నారు. గెలిచినా గెల‌వ‌క‌పోయినా.. ఓటు బ్యాంకును చీల్చ‌డం ద్వారా సీఎం ను టార్గెట్ చేసుకునే దిశ‌గా బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఇక‌, తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత కూడా.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. సెంటిమెంటును రంగ‌రిస్తూ.. కొడంగ‌ల్‌లో యువ‌త‌ను ఆక‌ర్సించేలా మ‌హిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకునే వ్యూహాలు వేస్తున్నారు. మొత్తంగా కొడంగ‌ల్‌లో ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయాలుజోరుగా సాగుతున్నాయి.