Begin typing your search above and press return to search.

కళ్యాణలక్ష్మి : పొన్నం సన్నాయి నొక్కులు !

2014 అక్టోబరు 12న కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట రూ.51 వేలు, అనంతరం రూ.75 వేలు, ఆ తదుపరి రూ.లక్ష 116కు పెంచారు.

By:  Madhu Reddy   |   22 Aug 2026 3:18 PM IST
కళ్యాణలక్ష్మి : పొన్నం సన్నాయి నొక్కులు !
X

’మేము అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి రూ.లక్ష 116తో పాటు పెళ్లిపందిట్లోనే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం అందజేస్తాం‘ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చింది. దానిని ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తులం బంగారం సంగతి పక్కన పెడితే కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116 ఇవ్వడమే గగనంగా మారింది. ఇటీవల కళ్యాణలక్ష్మి పథకం అమలుకోసం 2014లో విడుదల చేసిన ఎనిమిది జీఓలపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

విజయ్ గోపాల్ అనే న్యాయవాది వ్యక్తిగత హోదాలో హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం జారీచేసిన ఎనిమిది జీఓలను ఆయన ఈ పిటీషన్ ద్వారా సవాలు చేశారు. ఈ పథకం అమలుకు శాసనసభలో చట్టం చేయలేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ జీఓల ద్వారా అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణీత సమయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ నెల 12న జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ జీఓలపై స్టే విధించింది. ‘భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, రైతులు, ఉద్యోగులు, రిటైర్ అయిన వారికి చెల్లించకుండా ఇలా ఎందుకు ఉచిత పథకాలకు నిధులు మళ్లిస్తున్నారు. వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ?’ అంటూ హైకోర్టు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. పథకం అమలును నిలిపివేయాలని, ఇప్పటి వరకే జారీ అయిన చెక్కులను కూడా పంపిణీ చేయకూడదని ఆదేశాలు జారీచేసింది.

2014 అక్టోబరు 12న కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట రూ.51 వేలు, అనంతరం రూ.75 వేలు, ఆ తదుపరి రూ.లక్ష 116కు పెంచారు. దివ్యాంగులకు రూ.లక్ష 25 వేలు అందించేవారు. 2023 వరకు ఈ పథకం కింద రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 14.50 లక్షల జంటలు లబ్దిపొందాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2.28 లక్షల మందికి లబ్ది చేకూరిందని సమాచారం.

హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలయింది. ప్రతిపక్షాల నుండి విమర్శలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండడంతో ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. ‘పల్లె పల్లెకు పొన్నం‘ పేరుతో పొన్నం ప్రభాకర్ ఈ నెల 31 వరకు తన హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి కళ్యాణలక్ష్మి పథకం అమలు గురించి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ల కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు కూడా కేటాయించిందని, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయించి స్టే ను ఎత్తేయించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.