Begin typing your search above and press return to search.

జూబ్లీ హీట్ : బీజేపీ కోసం ఏపీ నేతలు

తెలంగాణాలో ఏకైక ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ హీటెక్కించేస్తోంది నిజానికి చూస్తే ఇది చాలా చిన్న ఎన్నిక.

By:  Satya P   |   27 Oct 2025 10:20 AM IST
జూబ్లీ హీట్ : బీజేపీ కోసం ఏపీ నేతలు
X

తెలంగాణాలో ఏకైక ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ హీటెక్కించేస్తోంది నిజానికి చూస్తే ఇది చాలా చిన్న ఎన్నిక. ఈ ఎన్నికలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో ఏ రకమైన ప్రభావం ఉండదు, ప్రభుత్వాలు కూడా కూలిపోవు. అయినా కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం రాజకీయంగా కాక రేపుతోంది. కాంగ్రెస్ తనది కాని సీటులో గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ అయితే తన సీటు తాని నిలబెట్టుకుని కాంగ్రెస్ మీద తొడకొట్టాలని చూస్తోంది. బీజేపీ గెలిచి చూపించి ఒక రాజకీయ అద్భుతాన్ని అవిష్కరించాలని తపన పడుతోంది.

బీజేపీ సంగతేంటి :

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్యనే పోటా పోటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ప్రచారం సాగుతోంది. బీజేపీని ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిన రెండు పార్టీలు భావించడమే కాకుండా కొత్త ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని సీఎం రేవంత్ రెడ్డి అంటే కాదు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ ఎదురు విమర్శలు చేస్తున్నారు. అలా బీజేపీని దాని రాజకీయాన్ని జనం దృష్టిలో అయోమయంలో పడేస్తున్నారు. దాంతో పాటుగా కమలనాధులు కూడా తమ అభ్యర్ధిని లేటుగా ప్రకటించారు. ఇక ప్రచార వ్యూహాలు కూడా పదును తేరడం లేదు అని అంటున్నారు.

ఆ రెండు పార్టీలు కూడా :

బీజేపీకి ఏపీలో ఎన్డీయేతో పొత్తు ఉంది. అలా టీడీపీ జనసేనతో కలసి కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. తెలంగాణాలో అయితే ఒంటరి పోరు అని అంటోంది. అయితే బీజేపీకి ఒంటరిగా వెళ్తే దక్కే ఓట్లు ఎంత అన్నది 2023 ఎన్నికల్లో రుజువు అయింది. పాతిక వేల ఓట్లు వచ్చాయి. అది సాధారణ ఎన్నికల్లో. ఈసారి ఉప ఎన్నిక జరుగుతోంది. మొత్తం అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. దాంతో ప్రతీ ఓటూ కీలకం అవుతున్న వేళ బీజేపీ గతంలో సాధించిన పాతిక వేళ ఓట్లను నిలబెట్టుకుని ఇంకా ఎక్కువ తెచ్చుకుంటేనే పరువు దక్కినట్లు. అయితే అది జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. దాంతో పాటు బీజేపీ టీడీపీ జనసేనల నుంచి పరోక్ష సహకారం ఆశిస్తోంది అని అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో టీడీపీకి ఓట్లు ఉన్నాయి. జనసేనకు కూడా అభిమాన గణం ఉంది. ఆ ఓట్లు తమకే పడాలని బీజేపీ భావిస్తోంది. కానీ బాహాటంగా మద్దతు కోరితే ఆంధ్రా పార్టీలతో లింక్ పెడతారు అన్న భయం ఉంది అంటున్నారు.

స్టార్ కాంపెయినర్లుగా :

ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ఏపీ నుంచి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు అంటున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఏపీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వారు బాగానే ప్రభావం చూపిస్తారు అని అంటున్నారు. దాంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ లను ప్రచారంలోకి దింపాలని బీజేపీ చూస్తోంది అని అంతున్నారు. వీరి ద్వారా ఏపీ ఓట్లను రాబట్టాలని చూస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో కొంత వెనకబడిన బీజేపీ గెలుపు ఆశలతో బరిలోకి దిగుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ మంచి పెర్ఫార్మ్ ఇస్తే నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్లుగా కూడా భావిస్తోంది అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీకి ఏపీ ఓటర్లు పార్టీలు నాయకుల అండదండలు ఉండాల్సిందే అంటున్నారు. మరి దీని మీద ప్రత్యర్ధులు ఏ విధంగా చిత్రీకరిస్తారో చూడాల్సిందే.