టెన్షన్ లో సీఎం రేవంత్ రాజకీయ ప్రత్యర్థులు.. అలా జరగకపోతే బాగుణ్ణు దేవుడా!
అయితే పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత పూర్తిగా సీన్ మార్చేశారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 13 Nov 2025 11:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీలోనే ఓ వర్గంలో ఆందోళన మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత బలవంతుడుగా మారతారని అప్పుడు తమ పరిస్థితి ఏంటో అని కొందరు కాంగ్రెస్ సీనియర్లు భయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, అధిష్టానంలో ఉన్న పరపతితో కొందరు, పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా సీఎం తమనేమీ చేయలేరన్న ధీమాతో మరికొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే.. తమ పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను ఓడించడం అంటే చిన్న విషయం కాదన్న అభిప్రాయం ఉండేది. ఎంత అధికారం ఉన్నా, క్షేత్రస్థాయిలో బలం లేకపోతే గెలవడం కష్టమన్న వ్యాఖ్యలు వినిపించేవి. ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రచారం మొదలైన కొత్తలో ఇదే అభిప్రాయం ఎక్కువగా వినిపించేది అని అంటున్నారు. ఇదే సమయంలో ఈ స్థానాన్ని గెలిపిస్తానని, తాను చెప్పిన వారికి టికెట్ ఇప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు బహిరంగ విమర్శలూ చేశారు. మాజీ మంత్రి జగ్గారెడ్డి వంటివారు జూబ్లీహిల్స్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అగ్గి రాజేశాయి.
అయితే పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత పూర్తిగా సీన్ మార్చేశారని అంటున్నారు. తానే అభ్యర్థిని అన్న స్థాయిలో సీఎం ప్రచారాన్ని హోరెత్తించడంతోపాటు రాజకీయంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు క్షేత్రస్థాయిలో మేజిక్ చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను సడన్ గా మంత్రిని చేయడం ఇందులో భాగమే అంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జనబలం లేని అజారుద్దీన్ ను మంత్రి చేసినా, పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు కాంగ్రెస్ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో పెదవి విరిచినట్లు చెబుతున్నారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చర్య మైనార్టీల్లో ఆయనపై నమ్మకం కలిగించిందని అంటున్నారు.
మాటలు చెప్పడమే కాకుండా, చేతల్లో చూపించే సత్తా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాటుకున్నారని ఆయన అనుకూల వర్గాలు ప్రచారం చేయడాన్ని మైనార్టీలు నమ్మారని అంటున్నారు. అదే సమయంలో మైనార్టీ నేతలుగా నగరంలో చక్రం తిప్పుతున్న ఓవైసీ సోదరులను రేవంత్ రెడ్డి తనవైపు తిప్పుకోవడంతో ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా కొట్టేశారని అంచనా వేస్తున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా టీడీపీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో చాలా మార్పునకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. వీటిన్నిటి వల్ల జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అనుకూలంగా వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు అంతర్మథనానికి లోనవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిని ధిక్కరించేలా కొన్ని స్వరాలు ఇప్పటివరకు వినిపించేవని.. ఇకపై అలాంటి వారు తమ నోళ్లకు ప్లాస్టర్ వేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో నెగ్గితే పార్టీ అధిష్టానం ఆలోచనలో కూడా మార్పు వస్తుందని అంటున్నారు. దీనివల్ల ఇకపై పార్టీపై ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత స్వేచ్ఛ వచ్చే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. దీనివల్ల వచ్చే మూడేళ్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లే నడుచుకోవాల్సివస్తుందని ఆయన ప్రత్యర్థులు మదనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
