మున్సిపల్ బరిలో కవిత.. ఆ పార్టీ గుర్తుపై పోరాడుతామని స్పష్టం..
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త కదలిక మొదలైంది. ఇప్పటి వరకు సామాజిక ఉద్యమంగా కొనసాగిన ‘తెలంగాణ జాగృతి’ ఇక ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది.
By: Tupaki Political Desk | 24 Jan 2026 1:39 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త కదలిక మొదలైంది. ఇప్పటి వరకు సామాజిక ఉద్యమంగా కొనసాగిన ‘తెలంగాణ జాగృతి’ ఇక ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జాగృతి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉండడంతో, తాత్కాలికంగా ఒక గుర్తుతో పోటీ చేయాలని అగ్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నేతృత్వంలో జాగృతి.. ‘సింహం’ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేవలం మున్సిపల్ ఎన్నికలకే కాకుండా, భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తును వినియోగించాలని జాగృతి భావిస్తున్నట్టు సమాచారం.
ఎందుకు ‘సింహం’ గుర్తు?
జాగృతి పార్టీగా అధికారికంగా రిజిస్టర్ కావాలంటే ఎన్నికల సంఘం వద్ద కొన్ని నిబంధనలు, కాల పరిమితులు ఉంటాయి. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే గుర్తు ఉన్న, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో అవగాహన కుదుర్చుకునే దిశగా జాగృతి అడుగులు వేసింది. ఈ క్రమంలో ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)’ కు చెందిన ‘సింహం’ గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే AIFB నాయకత్వంతో జాగృతి చర్చలు జరిపినట్లు సమాచారం. సూత్రప్రాయంగా అంగీకారం కూడా లభించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వ్యూహాత్మక అడుగేనా?
సింహం గుర్తు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా కనిపించబోతోంది. బలమైన, ధైర్యాన్ని సూచించే గుర్తుగా ‘సింహం’ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జాగృతికి గుర్తింపు వస్తుందన్న లెక్కలున్నాయి. అలాగే పార్టీ గుర్తు సమస్య లేకుండా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుంది. జాగృతి ఇప్పటి వరకు మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక అంశాలపై ఉద్యమంగా పనిచేసింది. ఇప్పుడు అదే వేదికను రాజకీయ రంగంలోకి తీసుకురావాలన్నదే ఈ నిర్ణయానికి నేపథ్యంగా విశ్లేషకులు చెబుతున్నారు. మున్సిపల్ స్థాయి నుంచి బలాన్ని పెంచుకొని, క్రమంగా స్థానిక సంస్థలన్నింటిలో పోటీ చేయాలన్నది జాగృతి దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది.
రాజకీయంగా ఎలాంటి ప్రభావం?
ఈ నిర్ణయం బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లలో జాగృతికి ఉన్న ఇమేజ్, కవిత వ్యక్తిగత రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిసి స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, AIFBతో కలిసి పోటీ చేయడం వల్ల ‘కూటమి రాజకీయాలు’ అన్న అంశం కూడా తెరపైకి వస్తోంది.
మొత్తంగా పరిశీలిస్తే.. తెలంగాణ జాగృతి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సింహం’ గుర్తుతో ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
