Begin typing your search above and press return to search.

రేవంత్ 'బదిలీల' రికార్డు.. దేశంలోనే టాప్

ఐపీఎస్ ల విషయానికి వస్తే.. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 18-20 సార్లు బదిలీలు జరిగాయి.

By:  Garuda Media   |   26 Feb 2026 3:05 PM IST
రేవంత్ బదిలీల రికార్డు.. దేశంలోనే టాప్
X

రాష్ట్రం ఏదైనా.. ముఖ్యమంత్రి ఎవరైనా పాలన మీద పట్టు రావటానికి తనదైన టీం అవసరం చాలా చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే తాము అధికారంలోకి వచ్చినంతనే తమకు సూట్ అయ్యే ఐఏఎస్.. ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వటం మామూలే. ఆ మాటకు వస్తే.. ఎన్నికల సమయానికే గెలుపు మీద ఆశలు ఉన్న పార్టీలు తాము పవర్ లోకి వచ్చినంతనే కీలక పదవులు ఎవరిని కేటాయించాలన్న దానిపై బ్లూప్రింట్ తయారు చేసుకోవటం మామూలే. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సైతం మినహాయింపు లేదు. ఇప్పుడు ఆయనతో వచ్చిన చిక్కల్లా.. అధికారంలోకి వచ్చిన దగ్గర దగ్గర రెండున్నరేళ్లకు దగ్గరవుతున్నప్పటికి ఆయన తనదైన టీంను తయారు చేసుకోలేకపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఈ రోజు (గురువారం) ఉదయమే తెలంగాణలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పటిలానే పరిపాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు.. పోస్టింగ్ లు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో రేవంత్ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు ఎన్నిసార్లు బదిలీ అయ్యారన్నది చూస్తే.. ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. 2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అంటే సుమారు 26 నెలల 19 రోజుల్లో కనీసం 18సార్లు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు.

2024లో మొత్తం 11 సార్లు బదిలీలు జరిగాయి 2024లో జనవరిలో మూడు సార్లు.. ఫిబ్రవరిలో 2సార్లు.. జూన్ లో 2సార్లు.. జులై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరులో ఒక్కోసారి చొప్పున బదిలీలు జరిగాయి. అంటే.. ఏడాదిలో ఏడు నెలల్లో బదిలీలు జరగటం గమనార్హం. 2025లో చూస్తే.. ఐదుసార్లు బదిలీలు జరిగాయి. సరాసరి చూస్తే.. ప్రతి రెండున్నర నెలలకు ఒకసారి బదిలీలు జరిగాయని చెప్పొచ్చు. ఈ ఏడాది (2026) ఇప్పటివరకు 2 నెలలు కూడా గడవలేదు. ఇప్పటికే రెండుసార్లు పెద్ద ఎత్తున బదిలీలు అయ్యాయి. ఈ రోజుతో కలిపి ఈ నెలలో 55 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయటం గమనార్హం.

ఐపీఎస్ ల విషయానికి వస్తే.. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 18-20 సార్లు బదిలీలు జరిగాయి. ఐపీఎస్ ల బదిలీలను చూస్తే ప్రతి ఒకట్రెండు నెలలకు చిన్నపాటి కానీ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బదిలీలు జరగటం కనిపిస్తుంది. 2024లో ఐదు నుంచి ఏడుసార్లు ఐపీఎస్ ల బదిలీల రిగితే.. 2025లో ఏకంగా పదిసార్లు బదిలీలు జరిగాయి. 2026లో ఈ రెండు నెలల్లో ఇప్పటికి మూడుసార్లు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రేవంత్ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నపరిస్థితి.

ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి రెండేళ్లలో భారీ ఎత్తున బదిలీలు కామన్. కానీ రెండేళ్లు దాటిన తర్వాత కూడా అదే పనిగా బదిలీలుజరగటమే కాస్తంత గందరగోళానికి గురి చేయటంతో పాటు.. అధికారుల్లో అభద్రతాభావానికి గురి చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు గడిచిన రెండేళ్లలో అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఎక్కువగా జరిగిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని చెప్పాలి. గణాంకాల వారీగా చూస్తే.. జాబితాలో ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది. కాకుంటే..యూపీ పెద్ద రాష్ట్రం కావటంతో దాన్ని మినహాయిస్తే.. జాబితాలో తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలుస్తుంది.

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మన దేశంలో సరాసరిన ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి ఒకే పోస్టులో 15 నెలలు మాత్రమే ఉంటున్నారు. తెలంగాణ, యూపీలో మాత్రం ఇది 8-10 నెలలకే పడిపోవటం గమనార్హం. అత్యధిక బదిలీలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత ఏపీ.. రాజస్థాన్.. బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి. బదిలీలుఅదే పనిగా జరిగే పాలన మీద పట్టు రావటం కష్టమవుతుంది. ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఐఏఎస్ లు కీలకంగా వ్యవహరిస్తారు. ఎంత సీనియర్ అధికారి అయినప్పటికి వారికి కేటాయించిన ప్లేస్ లో పనిని అర్థం చేసుకోవటానికి.. సిబ్బంది మీద పట్టు రావటానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఈ పరిస్థితుల్లో బదిలీల మీద కంటే పాలన మీద సీఎం రేవంత్ ఫోకస్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.