హైడ్రాతో నష్టం ఎవరికి.. రేవంత్ ఆలోచించాలి!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థతో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అంటే..
By: Garuda Media | 14 Aug 2025 8:00 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థతో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అంటే.. రాజకీయంగా ఇది అధికార పార్టీకి పెద్ద ఇబ్బందిగానే మారుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికి సుమారు 103 పిటిషన్లు.. హైడ్రాకు వ్యతిరేకంగా హైకోర్టు విచారణ పరిధిలో ఉన్నాయి. ఇదేమీ చిన్న విషయం కాదు. దీనిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒక వివాదం రావొచ్చు.. రెండు సార్లు విమర్శలు కూడా రావొచ్చు. కానీ, రోజు రోజుకు వివాదాలు, విమర్శలు ముసురుకుంటున్నాయి.
తాజాగా హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. హైడ్రా ఉన్నది వివాదాలు సృష్టించేందుకేనా? అని నిలదీసింది. అంతేకాదు.. హైడ్రా యుద్ధం చేస్తోందా? దీనికి ప్రజలను బలి చేస్తారా? అని ప్రశ్నించడం గమనార్హం. దీనికి కారణం.. సమయం, సందర్భం లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నే కూల్చివేతలు.. తవ్వకాలు చేపట్టడం. సహజంగానే భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయడం, లేదా ఆక్రమ ణలను తొలగించడం వంటివి వాటికి ఎవరూ వ్యతిరేకం కాదు.
కానీ, రాను రాను పేదల ఇళ్లు, మధ్యతరగతి ఆవాసాలను కూడా హైడ్రా టార్గెట్ చేస్తోంది. ఇది తీవ్ర వివాదంగా మారుతోంది. ఒకప్పుడు హైడ్రాపై హర్షం వ్యక్తం చేసిన సామాన్యులే.. ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఇది తమకు కంటిపై కునుకులేకుండా చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ.. మూసీ ఆక్రమణలను తొలగించే సంకల్పంతో ఏర్పాటు చేశారు. అప్పట్లో అందరూ దీనిని హర్షించారు. కానీ, రాను రాను విస్తృత అధికారాల పేరిట సాగిస్తున్న కూల్చివేతలతో అదే ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే.. హైడ్రా వ్యవస్థను పక్కన పెడతామంటూ.. బీఆర్ ఎస్ గతంలోనే ప్రకటించింది. తద్వారా దీనిని వ్యతిరేకిస్తున్న వర్గాల్లో బీఆర్ ఎస్ పట్ల సానుభూతి పెరుగుతున్న పరిస్థితికూడా కనిపి స్తోంది. అంటే.. హైడ్రాకు రాజకీయ రంగు పులుముకుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇది.. అధికార పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా.. పెద్ద సమస్యగానే హైడ్రా మారనుందున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అదేసమయంలో తవారి వాహనాలకు ప్రత్యేక రంగులు వేయడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. సో.. ఈ వ్యవహారం ముదరకముందే.. మేల్కోవడం, మధ్యేమార్గంగా వ్యవహరించడం.. సీఎం రేవంత్‌రెడ్డికి కీలకమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
