Begin typing your search above and press return to search.

ఉచితాలే రాజకీయ మంత్రం.. గెలుపు తర్వాత అదే ప్రజలకు గుదిబండ!

ఒక‌ప్పుడు పాలిటిక్స్ అంటే.. మంచి నేత‌లు.. క్లీన్ చిట్ ఉన్న నాయ‌కులు క‌నిపించేవారు.. వారి మాట‌లు వినిపించేవి.

By:  Garuda Media   |   8 Aug 2026 3:09 PM IST
ఉచితాలే రాజకీయ మంత్రం.. గెలుపు తర్వాత అదే ప్రజలకు గుదిబండ!
X

ఒక‌ప్పుడు పాలిటిక్స్ అంటే.. మంచి నేత‌లు.. క్లీన్ చిట్ ఉన్న నాయ‌కులు క‌నిపించేవారు.. వారి మాట‌లు వినిపించేవి. ఇప్పుడు అవేవీ లేవు!. ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజం. మీకు ఓటేస్తే మాకేంటి? అనే టైపులో ఇటు ఓట‌ర్లు.. మాకు ఓటేస్తే.. మీకిది!.. అంటూ నాయ‌కులు కూడా విచ్చ‌ల‌ విడి హామీలు గుప్పిస్తున్నారు. వీటిలో ప్ర‌ధానంగా ఉచిత ప‌థ‌కాల‌పై తెలంగాణ హైకోర్టు క‌న్నెర్ర చేసింది. అయితే.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ఏం తెలుసు మా క‌ష్టాలు.. అని నాయ‌కులు బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.

తాజాగా త‌మ నుంచి వ‌సూలు చేసిన స‌ర్ చార్జీని వెన‌క్కి ఇప్పించాలంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌పై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ఉచిత ప‌థ‌కాల అమ‌లుపై తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది. కూర్చుంటే.. సొమ్ము, నించుంటే సొమ్ము అంటూ త‌న‌దైన బాణిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. అయితే.. ఉచితాల‌పై కోర్టులు ఇలా వ్యాఖ్యానించ‌డం కొత్త‌కాదు.. నాయ‌కులు, పార్టీలు వాటిని పెడ‌చెవిన పెట్ట‌డ‌మూ కొత్త‌కాదు. గ‌త మూడేళ్ల కింద‌టే సుప్రీంకోర్టులో ఉచిత ప‌థ‌కాల‌పై పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.

ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకునేది లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అప్ప‌ట్లోనే తేల్చి చెప్పింది. పార్టీలు వ్య‌క్తిగ‌తంగా ఆలోచన చేసుకోవాల‌ని కూడా కోరింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ కూడా కోరింది. అయితే.. తాము వ్య‌తిరేకమంటూ.. కేంద్రం ముక్త‌స‌రిగా స‌మాధానం ఇచ్చి ఊరుకుంది. కానీ, చిత్రంగా ఆ త‌ర్వాత జ‌రిగిన బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇదే కేంద్రంలోని బీజేపీ పార్టీ ఉచిత ప‌థ‌కాల‌కు తెరదీసింది. ఏకంగా విద్యార్థుల‌కు స్కూటీలు, ఉచిత ఫీజులు, రీయింబ‌ర్సు మెంట్లు అంటూ ఊద‌రగొట్టి.. ఆయారాష్ట్రాల‌లో అధికారం ద‌క్కించుకుంది.

పేగు బంధంగా మారింది!

ఇక‌, ఓటుకు-ఉచితాల‌కు మ‌ధ్య బంధం పేగుబంధంగా మారింద‌న్న‌ది వాస్త‌వం. ఎన్నిక‌ల‌కు ముందే ఉచితాలు ప్ర‌క‌టిస్తున్న పార్టీలు పెరుగుతున్నాయి. ఇక‌, ఎన్నికల స‌మ‌యంలో ఒక పార్టీకి మించి మ‌రో పార్టీ ఉచితాల‌పై గొప్ప‌లు పోతున్నాయి. ఇటీవ‌లే త‌మిళ‌నాడులో ఉచిత తాళిబొట్ల పంపిణీ కోసం 800 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. నిజానికి పాఠ‌శాల విద్యకు కేటాయించాల్సిన 500 కోట్ల‌లో స‌గం కోత పెట్టి.. దీనికి కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

అలానే ఉచిత ల్యాప్ టాప్ ప‌థ‌కానికి ఏకంగా 2 వేల కోట్ల‌ను కుమ్మ‌రించింది. సో.. ఇవ‌న్నీ ఎన్నిక‌ల హామీలే. న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ఏం తెలుసు.. త‌మ క‌ష్టాలు అంటూ.. రాజ‌కీయ నేత‌లు ఉసూరు మంటున్నారు. అధికారంలోకి వ‌చ్చేందుకు ఉచితాలు ప‌నిచేస్తున్నా.. వ‌చ్చిన త‌ర్వాత చుక్క‌లు చూపిస్తున్నాయ‌న‌డానికి రెండు తెలుగు రాష్ట్రాలూ.. మిన‌హాయింపు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం చేయాలి?

+ ఉచితాల‌కు బ‌దులుగా.. సంస్థాగ‌త అభివృద్ధికి సంబంధించిన ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాలి.

+ వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కంటే కూడా.. సామాజిక ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేయాలి.

+ వేల కోట్ల రూపాయ‌ల‌ను ఉచితాల‌కు ఇస్తున్న పార్టీలు.. ఈ దిశ‌గా ఆలోచ‌న చేయాలి.

+ అధికార‌మే ప‌ర‌మావ‌ధి అయినా.. పార్టీలు ఉచితాల నుంచి మేల్కొనాల్సిన అవ‌స‌రం ఉంది.

+ ఒక పార్టీని చూసి మ‌రోపార్టీ చేతులు కాల్చుకునే ప‌రిస్థితి రాకుండా ఉండ‌డ‌మే కాదు.. ప్ర‌జ‌ల‌ను సైతం ఆ దిశ‌గా మ‌ళ్లించాలి.. ఒప్పించాలి!.