Begin typing your search above and press return to search.

హైడ్రాకు మరోసారి హైకోర్టు మొట్టికాయలు!

హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై వివరాలతో సహా కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుల ప్రకారమే హైడ్రా చర్యలు చేపడుతుందని వాదించారు.

By:  Garuda Media   |   18 Feb 2026 10:43 AM IST
హైడ్రాకు మరోసారి హైకోర్టు మొట్టికాయలు!
X

‘‘కంప్లైంట్ వస్తే చాలు.. ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ చేపట్టకుండా భూములు ప్రభుత్వానివిగా పేర్కొంటూ కంచె వేసేస్తారా? సహజ న్యాయ సూత్రాల్ని పాటించరా? ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తుందా? సుప్రీంకోర్టు చెప్పిన బుల్డోజర్ న్యాయం తీర్పు మీ ఏజెన్సీకి వర్తించదా? అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి పని చేస్తున్నారా? లేదా? ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తుందా? ఫిర్యాదు వచ్చినప్పుడు.. కంచె వేసేటప్పుడు మైడ్రా చట్టప్రక్రియను పాటించటం లేదు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది’’ అంటూ హైడ్రా తీరును తప్పు పడుతూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

హైదరాబాద్ లోని గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ లో 1351చదరపు గజాల స్థలంలో తన షెడ్ ను కూల్చేసి.. దాని చుట్టూ హైడ్రా కంచె వేయటాన్ని సవాలు చేస్తూ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హైడ్రా చర్య గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు.

హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై వివరాలతో సహా కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుల ప్రకారమే హైడ్రా చర్యలు చేపడుతుందని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తొలుత భూమి నుంచి కంచె తొలగించాలని పేర్కొంటూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఎలాంటి మార్పులు చేయొద్దని పిటిషనర్ కు స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వానివా? వివాదంలో ఉన్నాయా? కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా? అలాంటివి నిర్దారణ కాకుండా.. ఎలాంటి ఆధారాలు లేకుండా కంచె వేయటం సరికాదన్నారు.

జీవితకాలం సంపాదించిన డబ్బుతో ప్రజలు భూములు కొనుగోలు చేస్తారని.. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కంచెలు వేస్తూ పోవటం సరికాదన్న న్యాయస్థానం.. హైడ్రా మీద ఆరోపణలు ఇదే తొలిసారి కాదని.. వందల పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నట్లు చెప్పారు. కంచె వేయటానికి ఏజెన్సీకి ఉన్న అధికారం ఏమిటో కూడా చెప్పాలన్నారు. పిటిషనర్ ఫోన్ లాక్కునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి హైకోర్టు.. భూములపై పూర్తి సమాచారం లేకుండా కంచె వేయొద్దని ఆదేశించారు.