ఐటీ ఉద్యోగుల విలాస జీవితం వెనుక కష్టాల నిజం!
హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన కంపెనీకి రాజీనామా సమర్పించినప్పుడు సర్వీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే నెపంతో కంపెనీ ఏకంగా రూ.5.9 లక్షల పరిహారం డిమాండ్ చేసింది.
By: A.N.Kumar | 17 Dec 2025 4:15 AM ISTమెరిసే ఐటీ రంగం వెనుక దాగి ఉన్న ఉద్యోగుల కఠిన వాస్తవాలను తెలంగాణ హైకోర్టు మరోసారి వెలుగులోకి తెచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి భారీ పరిహారాలు డిమాండ్ చేస్తూ వారి రాజీనామాలను అడ్డుకునే కంపెనీల పద్దతులు చట్టవిరుద్ధమని.. ఇది ‘బాండెడ్ లేబర్’కు సమానమని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
కేసు పూర్వాపరాలు : ఉద్యోగి హక్కుల పోరాటం..
హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన కంపెనీకి రాజీనామా సమర్పించినప్పుడు సర్వీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే నెపంతో కంపెనీ ఏకంగా రూ.5.9 లక్షల పరిహారం డిమాండ్ చేసింది. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ ఆ ఉద్యోగి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం కంపెనీ పద్ధతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగి తరుఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘కంపెనీలు బహుళ సర్వీస్ ఒప్పందాలు సంతకం చేయించి రాజీనామా సమయంలో భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం భారతీయ ఒప్పంద చట్టం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ఉద్యోగులను బందీలుగా మార్చేలా ఉన్నాయని ఇది ‘బాండెడ్ లేబరి లాంటి వెట్టిచాకిరీ’ విధానానికి సమానమని ఆరోపించారు.
ఈ విధానాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఉద్యోగుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. కంపెనీలు ఇలాంటి భారీ పరిహారాలు డిమాండ్ చేయడం ఉద్యోగులపై మానసిక ఒత్తిడిని పెంచుతుందని ఇది చట్టవిరుద్దమని పేర్కొంది.
కార్మిక శాఖ పై విమర్శలు
ఐటీ రంగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక శాఖ ఉదాసీనతపైనా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంక్షేమాన్ని పర్యవేక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పరోక్షంగా విమర్శించింది.
హైకోర్టు ఆదేశాలు.. ఉద్యోగికి ఊరట..
ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఐటీ ఉద్యోగులకు తక్షణ ఊరటనిచ్చాయి. కంపెనీ డిమాండ్ చేసిన పరిహార మొత్తంతో సంబంధం లేకుండా ఉద్యోగి రాజీనామాను వెంటనే ఆమోదించి అతడిని విధుల్లోంచి రిలీవ్ చేయాలని సంబంధిత ైటీ సంస్థకు డైరెక్షన్ ఇచ్చింది. కంపెనీ డిమాండ్ చేసిన రూ.5.9 లక్షల పరిహారం వెనుక ఉన్న ఆధారాలు, సమంజసతను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించింది. సర్వీస్ బాండ్లు చట్టబద్దమైనప్పటికీ వాటిని దుర్వినియోగం చేసి ఉద్యోగులపై ఒత్తిడి తేవడం సహించరాదని కోర్టు సృష్టీకరించింది.
సామాజిక భద్రతపై ఆందోళన
ఉద్యోగికి ఊరటనిచ్చే ఆదేశాలతోపాటు ఐటీ రంగంలో విసృత సమస్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు దేశ ఆర్థిక వృద్ధికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. అయినప్పటికీ వారికి సామాజిక భద్రత, సరైన ఆరోగ్య రక్షణ లేకుండా పోవడం ఆందోళనకరమని పేర్కొంది. వేళలు లేకుండా పనిచేయడం వల్ల చిన్న వయసులోనే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలని హైకోర్టు కీలక సూచన చేసింది.
ఈ చారిత్రక తీర్పు ఐటీ రంగంలో కార్మిక హక్కుల రక్షణకు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీల ఒత్తిడికి గురవుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఇది గొప్ప భరోసా కల్పించింది.
