అలా మేమే చెప్పాం.. ఎన్నికలపై స్టే విధించం: హైకోర్టు
రిజర్వేషన్ల విషయంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకుంటోందని హైకోర్టు తెలిపింది.
By: Garuda Media | 28 Nov 2025 3:22 PM ISTతెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాష్ట్ర హైకోర్టు.. గ్రామ పోరుపై స్టే విధించేందుకు విముఖత వ్యక్తం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 17-19 శాతానికి పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభ మైన నేపథ్యంలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
రిజర్వేషన్ల విషయంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకుంటోందని హైకోర్టు తెలిపింది. పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగించాలని తాము ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా కోర్టు చదివి వినిపించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో46పై ఎలాంటి గందరగోళం లేదన్న న్యాయస్థానం.. దీనిపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. పాత రిజర్వేషన్‌ను అమలు చేయడం వల్ల వచ్చే నష్టం లేదని పేర్కొంది.
''పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని మేమే ఆదేశించాం. ఇప్పుడు మేమే స్టే ఎలా ఇస్తాం'' అని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే.. బీసీ సబ్ కేటగిరీ రిజర్వేషన్ కల్పించే వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికిగాను ఆరు వారాల గడువు విధించింది. ఇదిలా వుంటే.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది.
అయితే.. బీసీలు ఎక్కువగా ఉన్న చోట కూడా.. ఎస్సీలకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొంటూ కొందరు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ.. జీవో 46 ఇచ్చినా.. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 17, 19 శాతం రిజర్వేషన్లనే అమలు చేస్తున్నారని మరికొందరు.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళ వారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ల వైఖరిని తప్పుబట్టింది. రిజర్వేషన్ల వ్యవహారాన్ని చూపించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సరికాదని గతంలోనే వ్యాఖ్యానించింది.
